యూపీలో త్వరలో హిందీలో ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులు

యూపీలో త్వరలో హిందీలో ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులు

యూపీలో ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులను హిందీలో ప్రారంభించనున్నట్లు సీఎం యోగి స్పష్టం చేశారు. మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన కొన్ని పుస్తకాలు ఇప్పటికే హిందీలోకి అనువదించబడ్డాయని ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులు ఆయా సబ్జెక్టులను హిందీలో చదువుకోవచ్చని తెలిపారు. కొత్త విద్యా విధానం 2020 భాగంగా హిందీ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సును ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం మొదటి సంవత్సరం విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీలతో పాటు బయోకెమిస్ట్రీపై కొత్తగా మూడు పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. వారి మాతృభాషలో వీటిని అధ్యయనం చేయొచ్చని చెప్పారు. 

హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్‌ కోర్సును ప్రారంభించడాన్ని విద్యారంగంలో విప్లవాత్మకమైన పునరుజ్జీవన ఘట్టంగా పేర్కొన్న అమిత్‌ షా...  ప్రాంతీయ భాషలలో మెడికల్ అండ్ ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులలో విద్యను అందించడం మోడీ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఇప్పటికే 8 రాష్ట్రాలు తమ మాతృభాషలో ఇంజనీరింగ్ టెక్ట్స్ బుక్‌లను సిద్ధం చేసే పనిని ప్రారంభించాయని స్పష్టం చేశారు.