
- ఈ నెల 30న పదవీ బాధ్యతలు
- ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ సీ పాండే ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదీని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. కొత్త ఆర్మీ చీఫ్ గా ఆయన ఈ నెల 30న మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ గా ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 1964, జులై 1న జన్మించారు. మధ్యప్రదేశ్ లోని రేవా సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ లో స్కూల్, కాలేజీ విద్య పూర్తి చేశారు.
అమెరికా ఆర్మీ వార్ కాలేజ్ లోనూ చదివారు. డిఫెన్స్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో ఎంఫిల్, స్ట్రాటజిక్ స్టడీస్ అండ్ మిలిటరీ సైన్స్ లో రెండు మాస్టర్ డిగ్రీలు కూడా చేశారు. ఆర్మీ ఇన్ఫాంట్రీ (జమ్మూకాశ్మీర్ రైఫిల్స్)లో 1984, డిసెంబర్ 15న చేరారు. ఆర్మీలో 40 ఏండ్ల సుదీర్ఘ కెరీర్ లో అనేక హోదాల్లో పని చేశారు. రెజిమెంట్ కమాండ్, బ్రిగేడ్, అస్సాం రైఫిల్స్ డీఐజీ వంటి పదవులు నిర్వర్తించారు.
లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఇన్ఫాంట్రీ డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. 2022 నుంచి 2024 వరకూ నార్తర్న్ కమాండ్ కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఆర్మీ వైస్ చీఫ్గా నియమితులయ్యారు. ఆయన పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం వంటి అవార్డులను పొందారు.