క్రెడిట్‌కార్డ్ లింక్డ్ యూపీఐకి, సాధారణ యూపీఐకి వేర్వేరు రూల్స్ పెట్టాలని డిమాండ్
ఎండీఆర్‌తో తిరిగి క్యాష్ వాడకం పెరిగే చాన్స్
న్యూఢిల్లీ: కేంద్రం యూపీఐ ట్రాన్సాక్షన్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ను విధించడాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. పండుగ సీజన్ ముందు ఈ నిర్ణయం తీసుకోవడంతో చిన్న వ్యాపారులు మళ్లీ క్యాష్ బాట పట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల 15 నుంచి వ్యక్తులు వ్యాపారులకు చేసే రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీ పడుతుంది.
ఇప్పటికే స్వల్ప లాభాల మార్జిన్లతో నెట్టుకొస్తున్న చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) వ్యాపారులపై ఈ చార్జీ అదనపు భారంగా మారుతుందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ), క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఏఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
ఫీజు భారం తప్పించుకోవడానికి చిరు వ్యాపారులు యూపీఐ క్యూఆర్ కోడ్లను పక్కనపెట్టి మళ్లీ కస్టమర్ల నుంచి క్యాష్ తీసుకోవడానికే మొగ్గు చూపుతారని, దీంతో ఏళ్ల తరబడి సాధించిన డిజిటల్ పురోగతి దెబ్బతింటుందని హెచ్చరించాయి. లావాదేవీలు మళ్లీ నగదు రూపంలోకి మారితే అవి జీఎస్‌టీ లెక్కల్లోకి రావని, ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా మారలేదని ఆర్‌ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్ అన్నారు. పెట్రోల్ పంప్ డీలర్స్ కూడా యూపీఐ చార్జీలను వ్యతిరేకించారు. రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన ఫ్యూయల్ ట్రాన్సాక్షన్లపై ఫ్లాట్‌గా రూ.5 చార్జీ పడుతుంది. రూ.2 వేల లోపు ట్రాన్సాక్షన్లపై ఎటువంటి చార్జీ ఉండదు.
యూపీఐ ఫ్రీ ఉంటే అందరికీ లాభమే
యూపీఐ సేవలు ఫ్రీగా ఉండడంతో ఎకోసిస్టమ్‌లో అందరూ లాభపడ్డారని కొంత మంది ఎనలిస్టులు చెబుతున్నారు. యూపీఐ సేవలు విస్తరించడంతో ప్రభుత్వానికి నోట్ల ప్రింటింగ్ ఖర్చు తగ్గగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) కు టెక్నాలజీ లైసెన్సింగ్ ద్వారా డబ్బు వస్తోంది. పేటీఎం, ఫోన్‌పే వంటి పేమెంట్ అగ్రిగేటర్లు కస్టమర్ల డేటాను సేకరించి , వారికి లోన్లు, ట్రావెల్ ఆఫర్లు, ఇన్సూరెన్స్‌లు వంటివి అమ్ముతున్నాయి.
అలానే యాడ్స్ ద్వారా రెవెన్యూ కూడా సంపాదిస్తున్నాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కూడా పేమెంట్ అగ్రిగేటర్లు అమ్మే లోన్ల ద్వారా వడ్డీ పొందుతున్నారు. మరోవైపు ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్‌టీ డిపార్ట్‌మెంట్లకు ట్రాన్సాక్షన్ల ద్వారా మనీ ఎటుపోతోందో తెలుసుకునే వీలుంటోంది. ఎవరిపైనా ఖర్చుల భారం లేకపోయినా ప్రభుత్వం చార్జీలు వేసి ఇప్పుడు ప్రజలు క్యాష్ వైపు మారేలా చేస్తోంది. మరోవైపు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా జరిగే సాధారణ యూపీఐ చెల్లింపులకు, క్రెడిట్ కార్డుల తరహాలో ఎండీఆర్ విధించడం సమంజసం కాదని ఆర్‌ఏఐ వాదిస్తోంది. యూపీఐ నెట్‌వర్క్ నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం లేదా ఆర్‌బీఐ భరించాలని, వ్యాపారులపై నెట్టకూడదని కోరింది.
పండుగల సీజన్‌లో దెబ్బ
దసరా, దీపావళి అమ్మకాల సీజన్ మొదలవుతున్న సమయంలో ఈ భారం మోపడం వల్ల మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుందని సీఎంఏఐ పేర్కొంది. ఈ ఫీజుల విధానాన్ని మళ్లీ సమీక్షించాలని, క్రెడిట్‌కార్డ్ లింక్డ్ యూపీఐకి, సాధారణ డెబిట్ యూపీఐకి వేర్వేరు నిబంధనలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరింది.
క్రెడిట్ కార్డ్ కంటే తక్కువే
యూపీఐ ట్రాన్సాక్షన్లపై వేసిన చార్జీలను కేవలం వ్యాపారులు మాత్రమే భరించాల్సి ఉంటుంది. రూ.2 వేల పైన ఉన్న ట్రాన్సాక్షన్లపైనే ఈ చార్జీ పడుతుంది. సాధారణంగా క్రెడిట్ కార్డులపై 1.5శాతం నుంచి 2.5శాతం వరకు ఎండీఆర్ ఉంటుండగా, యూపీఐ ట్రాన్సాక్షన్లపై 0.4 శాతం లేదా గరిష్టంగా రూ.300 మాత్రమే పడుతుంది. ఉదాహరణకు రూ.10 వేల లావాదేవీపై కార్డులకు రూ.150–రూ.250 పడితే, యూపీఐకి కేవలం రూ.40 మాత్రమే అవుతుంది. అదే రూ.1 లక్ష లావాదేవీపై కార్డుకు రూ.1,500–రూ.2,500 వరకు ఖర్చవగా, యూపీఐపై గరిష్ట పరిమితి వల్ల రూ.300 తోనే ముగుస్తుంది.
