ఉప్పల్, వెలుగు: ఉప్పల్ జోన్ పరిధిలో దోమల నివారణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జోనల్ కమిషనర్ రాధిక గుప్త తెలిపారు. ముఖ్యంగా దోమల ఉత్పత్తి కేంద్రాలైన మూసీ పరివాహక ప్రాంతాలు, నాలాల్లో డ్రోన్ల సహాయంతో ప్రతిరోజూ ఎంఎల్ ఆయిల్ స్ప్రేయింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దోమల బెడద అధికంగా ఉన్న ఉప్పల్ భగాయత్ ఫేజ్-1, 2 ప్రాంతాల్లో సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు సమగ్ర చర్యలు తీసుకోవాలని, అడల్ట్ మస్కిటోస్ నిర్మూలనకు ఏసీఎం స్ప్రే చేయాలని సూచించారు.
కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సత్వర సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అలాగే తమ పరిసరాల్లో నీటి నిల్వలు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

