గిఫ్ట్‌‌ డీడ్‌‌ రద్దు చెల్లదు.. కలెక్టర్‌‌ ఉత్తర్వుల రివ్యూ అధికారం కమిషనర్‌‌కు లేదు:హైకోర్టు తీర్పు

గిఫ్ట్‌‌ డీడ్‌‌ రద్దు చెల్లదు.. కలెక్టర్‌‌ ఉత్తర్వుల రివ్యూ అధికారం కమిషనర్‌‌కు లేదు:హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: సీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టం అమలు, అప్పీలేట్ అథారిటీల పరిధిపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించే అధికారం సీనియర్ సిటిజన్ల చట్టం కింద నియమితులైన కమిషనర్‌‌కు లేదని తేల్చి చెప్పింది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన సి. రాములు తన మనవడైన సి. శ్రీనివాస్‌‌కు 2018లో గిఫ్ట్ డీడ్ ద్వారా ఒక ఇంటిని ఇచ్చారు. ఆ తర్వాత శ్రీనివాస్ పాత ఇంటిని కూల్చివేసి రూ. 4 కోట్లు వెచ్చించి కొత్త భవనాన్ని నిర్మించారు.

అయితే, తనను సరిగ్గా చూసుకోవడం లేదంటూ తాత రాములు 2022లో ఆ గిఫ్ట్ డీడ్‌‌ను రద్దు చేయాలని ఆర్డీవోను ఆశ్రయించారు. దరఖాస్తును ఆర్డీవో తోసిపుచ్చగా.. అప్పీలేట్ అథారిటీ అయిన కలెక్టర్ కూడా గిఫ్ట్ డీడ్‌‌లో "పోషణ" అనే షరతు లేనందున రద్దు చేయడానికి నిరాకరించారు. దాంతో కలెక్టర్ నిర్ణయంపై రాములు సీనియర్ సిటిజన్స్ కమిషనర్‌‌కు ఫిర్యాదు చేయగా.. గత ఉత్తర్వులను పునఃపరిశీలించాలని కమిషనర్ తిరిగి కలెక్టర్‌‌కు పంపారు. దీని ఆధారంగా కలెక్టర్ 2025లో గిఫ్ట్ డీడ్‌‌ను రద్దు చేశారు.

కలెక్టర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనవడు శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన బెంచ్‌‌..సీనియర్‌‌ సిటిజన్స్‌‌ చట్టం కింద ప్రాథమిక అధికారి ఆర్డీవో, అప్పీలెట్‌‌ ట్రైబ్యునల్‌‌ కలెక్టర్‌‌ మాత్రమేనని తెలిపింది. అప్పీలెట్‌‌ ట్రైబ్యునల్‌‌గా కలెక్టర్‌‌ జారీ చేసిన ఉత్తర్వులపై రెండో అప్పీలుగా విచారణ చేపట్టే అధికారం కమిషనర్‌‌కు లేదని స్పష్టం చేసింది. 

ఉత్తర్వులు పునఃసమీక్షించాలంటూ కమిషనర్‌‌ ఇచ్చిన ఉత్తర్వులు చట్టపరంగా చెల్లవని తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా కలెక్టర్‌‌ గిఫ్ట్‌‌డీడ్‌‌ను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు కూడా చెల్లవని తీర్పు వెలువరించింది. గిఫ్ట్‌‌డీడ్‌‌ రద్దు చేస్తూ కలెక్టర్‌‌ జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్‌‌ జడ్జి వెలువరించిన తీర్పును రద్దు చేసింది. కలెక్టర్‌‌ గిఫ్ట్‌‌డీడ్‌‌ రద్దు చేయడం చెల్లదని, ఆస్తిపై తాతకు ఉన్న హక్కులను సివిల్‌‌ కోర్టులో తేల్చుకోవాలంటూ కోర్టు పేర్కొంది.