- 2 కోట్ల మందికి ఫస్ట్.. 50 లక్షల మందికి సెకండ్ డోస్: కేంద్రం
- ఏ రాష్ట్రంలోనూ వ్యాక్సిన్లకు కొరత లేదని వెల్లడి
- దేశంలో ఒక్కరోజే 22 వేల కేసులు.. ఈ ఏడాది ఇదే హయ్యెస్ట్
- రోజూ వచ్చే కొత్త కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే
- అవసరమైన ప్రాంతాల్లో లాక్డౌన్ పెడ్తం: మహారాష్ట్ర సీఎం
- కేసులు పెరగవచ్చు.. జాగ్రత్తగా ఉండాలి: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 2.52 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశామని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. 4.78 లక్షల సెషన్లలో వీళ్లందరికీ టీకాలు అందించామని చెప్పింది. ఇందులో 71 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లు, 70 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఫస్ట్ డోస్ ఇచ్చామని.. 39 లక్షల మంది హెల్త్ కేర్, 5.8 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు సెకండ్ డోస్ ఇచ్చామని తెలిపింది. అలాగే 45 ఏళ్ల కన్నా ఎక్కువ వయసుండి వివిధ రకాల వ్యాధులున్న 9.29 లక్షల మందికి, 55 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఫస్ట్ డోస్ వేశామంది. బుధవారం 54వ రోజు టీకా డ్రైవ్లో భాగంగా 13,17,357 మందికి వ్యాక్సిన్ వేశామని తెలిపింది. ఇందులో 10,30,243 మంది లబ్ధిదారులకు ఫస్ట్ డోస్ ఇవ్వగా.. 2,87,114 మందికి సెకండ్ డోస్ ఇచ్చినట్లు తెలిపింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ వ్యాక్సిన్లకు కొరత లేదని స్పష్టం చేసింది.
దేశంలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 22,854 కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. ఇందులో 85.91 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులోనే రికార్డయ్యాయంది. దేశంలో ఇంత ఎక్కువ కేసులు నమోదవడం ఈ ఏడాది ఇదే తొలిసారని చెప్పింది. గత 24 గంటల్లో దేశంలోని మొత్తం కేసుల్లో 60 శాతం (13,659 కేసులు) ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయని తెలిపింది. ఆ తర్వాత కేరళలో 2,475, పంజాబ్లో 1,393 కేసులు రికార్డయ్యాయంది. దేశంలో ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 1.12 కోట్లకు పెరిగిందని.. ప్రస్తుతం లక్షా 89 వేల యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కరోనాతో దేశంలో 126 మంది చనిపోయారంది. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 1,58,189కు పెరిగిందని తెలిపింది.
అలసత్వమొద్దు.. కరోనా పోలేదు
మహారాష్ట్ర సహా ఇంకొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశ ప్రజలను కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా ఇంకా తగ్గలేదని.. ప్రజలు అలసత్వం ప్రదర్శించొద్దని కోరింది. మహమ్మారి ఎప్పుడైనా విజృంభిచవచ్చని హెచ్చరించింది. నీతిఆయోగ్ మెంబర్ వీకే పాల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రమవుతోంది. మళ్లీ వెనక్కి, లాక్డౌన్ పరిస్థితుల్లో వెళ్తున్నాం’అని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాప్తి ఎక్కువున్న జిల్లాల్లో వ్యాక్సినేషన్ స్పీడు పెంచాలన్నారు. ఢిల్లీ, చుట్టుపక్క ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పరిస్థితి అదుపులోనే ఉంది: ఉద్ధవ్
మహారాష్ట్రలో అవసరమైన ప్రాంతాల్లో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తామని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. ముంబైలోని జేజే హాస్పిటల్లో గురువారం కొవ్యాగ్జిన్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపుతప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్ నిబంధనలు విధిస్తాం. దీనిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు. సడలింపులను ప్రజలు అడ్వాంటేజ్గా తీసుకుంటే రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టే పరిస్థితి వస్తుందని అని స్టేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ టీపీ లహానే హెచ్చరించారు.
మహారాష్ట్రలో ఒక్కరోజే 13 వేలకు పైగా కేసులు
మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 13,659 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఇంత ఎక్కువగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 22.52 లక్షలకు చేరాయి. వైరస్తో ఇప్పటివరకు 52 వేల మందికిపైగా మరణించారు. కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ 7 పాయింట్ల యాక్షన్ ప్లాన్ను రెడీ చేసింది. వేగంగా కాంటాక్ట్ ట్రేసింగ్, వైరస్ సోకినవారి రిలేటివ్స్కు టెస్టులు, హాట్ స్పాట్స్లో మాస్ టెస్టింగ్ లాంటివి అమలు చేయనుంది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సెంటర్లు ఇక 24 గంటలూ తెరుచుకోవచ్చని సర్కారు వెల్లడించింది. అవసరమైనంత స్టాఫ్ ఉంటే పగలు, రాత్రి సెంటర్లు తెరుచుకోవచ్చంది.
నాగ్‌పూర్‌లో లాక్డౌన్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో లాక్డౌన్ విధించారు. నాగ్పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తామని ఆ జిల్లా గార్డియన్ మంత్రి నితిన్ రౌత్ గురువారం వెల్లడించారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపారు. పాలు, నిత్యావసర సరకులు, కూరగాయలు, మందుల షాపులే తెరిచి ఉంటాయన్నారు.

