- ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యుడు ఎలీ క్రేన్
- ఈ బిల్లు చట్టంగా మారితే ఇండియన్ స్టూడెంట్స్‌పై ప్రభావం
వాషింగ్టన్: హెచ్ 1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎలీ క్రేన్ రెండు రోజుల క్రితం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లులో పలు సంచలన ప్రతిపాదనలు చేశారు. ‘ది ఎండ్ హెచ్-1బీ వీసా యాక్ట్- 2026’ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లులో.. కొత్త హెచ్-1బీ వీసాల జారీని మూడేండ్లపాటు నిలిపివేయాలని సూచించారు.
ఈ సమయంలో హెచ్1 బీ వీసా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుతం ఏడాదికి ఉన్న 65 వేల వీసాల పరిమితిని ఏకంగా 25 వేలకు తగ్గించాలని ప్రతిపాదించారు. లాటరీ పద్ధతిని రద్దు చేసి.. అత్యధిక వేతనం ఇచ్చే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దీని ప్రకారం కనీస వార్షిక వేతనం 2లక్షల డాలర్లు ఉండాలని ప్రతిపాదించారు.
హెచ్ 1బీ వీసాదారులు తమ జీవిత భాగస్వాములను లేదా పిల్లలను అమెరికాకు తీసుకురావడాన్ని నిషేధించాలని సూచించారు. థర్డ్-పార్టీ ఏజెన్సీల ద్వారా ఉద్యోగ నియామకాలను పూర్తిగా అడ్డుకోవాలని ప్రతిపాదించారు. విదేశీ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పనిచేసేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైయినింగ్(ఓపీటీ) ప్రోగ్రామ్‌ను కూడా రద్దు చేయాలన్నారు.
హెచ్1 బీ వీసా పొందిన వారు గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోకుండా నిరోధించాలని ప్రతిపాదించారు. అర్హులైన అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు తన్నుకుపోకుండా అడ్డుకోవడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లు ఎలీ క్రేన్ చెప్పారు. ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదం తెలిపితే ఇది చట్టంగా మారుతుంది. అమలులోకి వస్తే అమెరికాలో స్థిరపడాలని కలలు కనే లక్షలాది మంది భారతీయులపై ప్రభావం పడనుంది.

