వెంకటేశ్వర స్వామి కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం. కలియుగంలో ప్రజల కోరికలను తీర్చే స్వామి వారి లీలలు అన్నీ ఇన్ని కాదు. హైదరాబాదుకు సమీపంలోని చిలుకూరులో ఉన్న బాలాజీ టెంపుల్ కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అక్కడికి వెళ్లి మెుక్కుకుని ప్రదక్షిణలు చేసిన వారికి ఖచ్చితంగా అమెరికా వీసా వస్తుందని నమ్మకం. అందుకే ఆయనను అందరూ వీసా బాలాజీ అని పిలుస్తుంటారు. ఇది కేవలం నమ్మకమే కాదు వేలు లక్షల మంది భక్తులకు నిజంగా జరిగింది కూడా. భారతీయులు ఎంతగానో నమ్మి కొలిచే ఆ దేవదేవుడిపై అమెరికా సెనెటర్ చేసిన నోటిదురుసు వ్యాఖ్యలు హిందువులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.
అమెరికా సెనేటర్ ఎరిక్ స్మిత్ హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. అమెరికాలోని H-1B వీసా ప్రోగ్రామ్‌ను విమర్శించే క్రమంలో.. ఆయన చిలుకూరు దేవాలయాన్ని 'వీసా టెంపుల్' అని సంబోధిస్తూ, భారతీయ టెక్కీలను వీసా ముఠా అని అభివర్ణించడం తీవ్ర దుమారం రేపుతోంది. చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులు తమ పాస్‌పోర్టులను పెట్టి మొక్కుకోవడంపై స్మిత్ చేసిన కామెంట్స్ కేవలం ఒక ఆలయంపై చేసిన విమర్శ మాత్రమే కాదని.. ఇది హిందూ సంప్రదాయాలను, భక్తుల విశ్వాసాలను కించపరచడమేనని హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
An American professor just sued SMU, alleging the department chair systematically favored Indian-origin candidates for tenure.
— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026
100% approval for them, zero for equally qualified non-Indians.
This isn’t isolated; it’s the pattern when these networks capture hiring. pic.twitter.com/60CezLg8pw
భారతీయులు తమ వీసాలు విజయవంతంగా రావడం కోసం వేల సంఖ్యలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని, ఇలాంటి గందరగోళ వ్యవస్థతో అమెరికన్ కార్మికులు పోటీ పడకూడదని వ్యాఖ్యానించారు ఎరిక్ స్మిత్. అంతేకాకుండా అమెరికాలోని టెక్ దిగ్గజ సంస్థలు అమెరికన్ గ్రాడ్యుయేట్లను కాదని.. భారతీయ మూలాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయని, అక్కడ మెరిట్ స్థానంలో జాతి పక్షపాతం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు భారతీయ ప్రతిభను అవమానించడమేనని ఐటీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
హిందూ సమాజం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. భక్తికి, వృత్తి నైపుణ్యానికి మధ్య ఉన్న తేడాను సెనేటర్ గుర్తించలేకపోయారని విమర్శిస్తోంది. చిలుకూరు బాలాజీ దేవాలయం దశాబ్దాలుగా కోట్లాది మందికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందని, భారతీయులు తమ కష్టంతో పాటు చేసే పనిలో దేవుని ఆశీస్సులను కోరుకోవడం తమ సంస్కృతిలో భాగమని భక్తులు గుర్తు చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎనలేనిదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పవిత్రమైన ఆలయాన్ని, ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అంటున్నారు.
చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్, ఇతర ఆధ్యాత్మిక వేత్తలు దీనిపై స్పందిస్తూ.. సెనేటర్ వ్యాఖ్యలు అజ్ఞానంతో కూడుకున్నవని, విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే విద్యార్థుల ఆశలను తప్పుగా చిత్రించడం దారుణమని పేర్కొన్నారు. భారతీయులు అమెరికా వెళ్లేది కేవలం వీసాల కోసం మాత్రమే కాదని.. తమ మేధస్సుతో ఆ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. స్మిత్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లక్షల మంది డిమాండ్ చేస్తున్నారు.
