హరారే: జింబాబ్వేకు ఆరోగ్య సహాయాన్ని నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ప్రతిపాదిత మల్టీ మిలియన్ డాలర్ల ద్వైపాక్షిక నిధుల ఒప్పందంపై చర్చలు విఫలమవడంతో, క్రమంగా జింబాబ్వేకు హెల్త్ అసిస్టెంట్‌ను నిలిపివేస్తామని చెప్పింది. జింబాబ్వేలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ చికిత్స, నివారణ, క్షయ, మలేరియా, మాతాశిశు ఆరోగ్యం, వాధుల వ్యాప్తి నిరోధం వంటి ఆరోగ్య కార్యక్రమాలకు ఐదేండ్ల కాలానికి సుమారు రూ.3 వేల కోట్ల సహాయాన్ని అందించేందుకు అమెరికా ప్రతిపాదించింది.
అయితే, నిధులు ఇచ్చేందుకు అమెరికా పెట్టిన షరతులు తమకు ఆమోదయోగ్యంగా లేవని జింబాబ్వే ప్రభుత్వ ప్రతినిధి మాంగ్వానా తెలిపారు. డేటా షేరింగ్, సమాచార మార్పిడిపై షరతులు చాలా కఠినంగా ఉన్నాయన్నారు. జింబాబ్వే పౌరుల హెల్త్ డేటా, వైరస్ నమూనాలు, ఎపిడెమియోలాజికల్ సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు పర్మిషన్ కోరిందన్నారు.
తమ డేటా ద్వారా కొత్త వ్యాక్సిన్లు లేదా చికిత్సలు కనుగొంటే, వాటిని తమకు అందిస్తామనే గ్యారంటీ ఇవ్వకపోవడంతో చర్చలు నిలిపివేయాలని అధ్యక్షుడు ఎమర్సన్ ఆదేశించారన్నారు.
