డిజిటల్ ట్యాక్స్ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌ వినియోగించుకోవాలి : ఐటీ చీఫ్ కమిషనర్ సంజయ్ బహదూర్

డిజిటల్ ట్యాక్స్ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌ వినియోగించుకోవాలి : ఐటీ చీఫ్ కమిషనర్ సంజయ్ బహదూర్
  • యువత, వ్యాపారులు పన్నులపై అవగాహన పెంచుకోవాలి
  • ఐటీ చీఫ్ కమిషనర్ సంజయ్ బహదూర్  సూచన
  • పీఐబీ ఆధ్వర్యంలో ‘ప్రారంభ్ 2026’ సదస్సు

హైదరాబాద్, వెలుగు: ఆదాయ పన్ను చట్టం–2025ను ప్రజలకు మరింత సులభంగా అర్థమయ్యేలా రూపొందించామని,  ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలంగాణ, ఏపీ చీఫ్  కమిషనర్  ఆఫ్  ఇన్‌‌‌‌‌‌‌‌కమ్  ట్యాక్స్  సంజయ్  బహదూర్  తెలిపారు. బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని అమరావతి ఆడిటోరియంలో ప్రెస్  ఇన్ఫర్మేషన్  బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో జరిగిన ‘ప్రారంభ్ 2026’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పారదర్శకమైన పన్ను వ్యవస్థే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, కొత్త చట్టంతో పన్ను ప్రక్రియలో గందరగోళం తగ్గుతుందన్నారు.

డిజిటల్  ట్యాక్స్  ఫైలింగ్‌‌‌‌‌‌‌‌ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవాలన్నారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. టెక్నాలజీ ఆధారిత పారదర్శక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. యువత, వ్యాపారులు పన్నులపై అవగాహన పెంచుకోవాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు సులభ సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని,  పన్ను చట్టాలపై ఉన్న అపోహలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.

800 సెక్షన్ల నుంచి 530కి కుదింపు

ఇన్‌‌‌‌‌‌‌‌కమ్  ట్యాక్స్  కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ పాత ఇన్‌‌‌‌‌‌‌‌కమ్  ట్యాక్స్  యాక్ట్–961లో 800కు పైగా సెక్షన్లు ఉండగా, కొత్త చట్టంలో అవసరం లేని వాటిని తొలగించి సుమారు 530 సెక్షన్లను మాత్రమే ఉంచామన్నారు. ప్రజలు చట్టాన్ని చూడగానే అర్థం చేసుకునేలా దీన్ని రూపొందించామని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం పన్ను కట్టకుండా ఎవరూ తప్పించుకోలేరని, పారదర్శకతలో భాగంగానే ఈ వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ప్రజలకు చట్టంపై మరింత స్పష్టత ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా ఈరోజు మొత్తం 23 ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.