ఆఖరి దశలో అడ్డంకి.. ఉత్తరాఖండ్​ టన్నెల్​ రెస్క్యూలో మొరాయించిన మెషిన్

ఆఖరి దశలో అడ్డంకి.. ఉత్తరాఖండ్​ టన్నెల్​ రెస్క్యూలో మొరాయించిన మెషిన్
  • టన్నెల్​లో ఆగిన డ్రిల్లింగ్​ పనులు
  • 12 రోజులుగా లోపల చిక్కుకున్న కార్మికులు
  • ఇప్పటి వరకు 48 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తి
  • కార్మికులు శుక్రవారం బయటకు వచ్చే చాన్స్

ఉత్తరకాశీ: ఇప్పుడో ఇంకాసేపట్లోనో శుభవార్త వింటామని సంతోషించేలోపు అనుకోని అవాంతరం వచ్చిపడింది.. ఉత్తరాఖండ్  టన్నెల్​లో రెస్క్యూ పనులు గురువారం మరోసారి నిలిచిపోయాయి. చివరిదశకు చేరుకున్న స్థితిలో డ్రిల్లింగ్​ మెషిన్ మళ్లీ మొరాయించింది. తవ్వకపు పనులు నిలిచిపోయాయి. కార్మికులు శుక్రవారమే బయటకు వచ్చే అవకాశం ఉందని రెస్క్యూ అధికారులు చెబుతున్నారు. టన్నెల్​లో జరుగుతున్న రెస్క్యూ పనులను గురువారం అంతర్జాతీయ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ పరిశీలించారు. టన్నెల్​కు సమాంతరంగా తవ్వుతున్న డ్రిల్లింగ్​ మెషిన్​కు అడ్డంకులు ఎదురయ్యాయని డిక్స్ తెలిపారు. కూలిన శిథిలాలలోని ఇనుప రాడ్లు మెషిన్​కు అడ్డుపడుతున్నాయని, దీంతో తవ్వకం పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. బుధవారం అర్ధరాత్రి దాటాక దాదాపుగా తవ్వకం చివరికి వచ్చిందని అధికారులు ప్రకటించారు. ఏ క్షణంలోనైనా కార్మికులను బయటకు తీసుకొస్తామని చెప్పారు. అంబులెన్స్​లు బయట మోహరించి, ఎన్డీఆర్ఎఫ్​ సిబ్బందిని టన్నెల్​లోకి పంపించారు. అయితే, డ్రిల్లింగ్​ మెషిన్​కు ఐరన్ గ్రిడ్​ అడ్డు పడడంతో తవ్వకం నిలిపేయాల్సి వచ్చింది. దీంతో గురువారం ఉదయమే బయట పడాల్సిన కార్మికులు అర్ధరాత్రి దాటినా లోపలే ఉండిపోయారు. ఐరన్ గ్రిడ్​ను కట్ చేసి తొలగించాక గురువారం ఉదయం మరోమారు డ్రిల్లింగ్ మెషిన్ పని మొదలుపెట్టింది. కానీ తవ్వకం అనుకున్నంత వేగంగా సాగలేదని, ఘడియఘడియకూ అడ్డంకులు ఎదురయ్యాయని అధికారులు చెప్పారు. గురువారం రాత్రి మరోమారు డ్రిల్లింగ్​ మెషిన్  ఆగిపోయింది. ఈసారి ఎదురైన అడ్డంకి ఏంటనే విషయంలో అర్నాల్డ్ డిక్స్ కానీ, అధికారులు కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజా పరిణామంతో కార్మికులను బయటకు తీసుకురావడం ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందా అనేదానిపైనా స్పష్టత లేదు. మరోవైపు, రెస్క్యూ పనులను హడావుడిగా చేయాల్సిన అవసరంలేదని అర్నాల్డ్ డిక్స్ చెప్పారు. కార్మికులంతా సేఫ్​గా ఉన్నారని, వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు తొందరపడితే రెస్క్యూ పనుల్లో ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని డిక్స్ హెచ్చరించారు.

అవాంతరాలతో ఆలస్యం

కార్మికులను కాపాడేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇనుప రాడ్లు అడ్డు రావడంతో బుధవారం అర్ధరాత్రి డ్రిల్లింగ్ ఆపేశారు. డ్రిల్లింగ్ మెషిన్​ను పూర్తిగా బయటకు తీసి, ఆ ఇనుప రాడ్లను కట్ చేశారు. మళ్లీ గురువారం ఉదయం డ్రిల్లింగ్ ప్రారంభించారు. ‘‘45 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఇనుప రాడ్లు అడ్డు తగిలాయి. వాటిని తొలగించేందుకు ఆరు గంటలు పట్టింది. రెస్క్యూ పనులు మళ్లీ ప్రారంభించాం. మొత్తం 57 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. అదంతా పూర్తయ్యేందుకు 12 నుంచి 14 గంటలు పడుతుంది. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని లోపలికి పంపించి, కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తాం. దీనికి మరో 3 గంటలు పడుతుంది” అని ఉత్తరాఖండ్ ఓఎస్డీ భాస్కర్ ఖుల్బే గురువారం ఉదయం 10 గంటలకు ప్రకటించారు. ‘‘డ్రిల్లింగ్ చేస్తూ లోపలికి వెళ్లే కొద్దీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం వరకు కార్మికులను బయటకు తీసుకొస్తాం” అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) మెంబర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ తెలిపారు. కాగా, గురువారం 48 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయిందని మరో అధికారి తెలిపారు.

కార్మికులతో మాట్లాడిన ఉత్తరాఖండ్​ సీఎం ధామి..

కేంద్రమంత్రి వీకే సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్ గురువారం టన్నెల్ దగ్గరికి వచ్చారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టన్నెలో చిక్కుకున్న కార్మికులతో సీఎం ధామి మాట్లాడారు. ‘‘మేం మీ దగ్గరి దాకా వచ్చాం. మీరంతా ధైర్యంగా ఉండండి” అని భరోసా ఇచ్చారు. కాగా, ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్ పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ కు చెందిన ముగ్గురు సైంటిస్టులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.