
మీరు బొమ్మల పెళ్లిళ్లు విన్నారు… దోష నివారణ కోసం చెట్లు, పుట్టలతో చేసుకునే పెళ్లిళ్లు చూశారు… కానీ గుజరాత్ లో జరిగిన వెరైటీ వెడ్డింగ్ మాత్రం ఎక్కడా జరగదు. గుర్రంపై పెళ్లి కొడుకు ఊరేగింపు, బ్యాండ్ బాజా, బరాత్, గార్భా డ్యాన్సులు, పసందైన విందు భోజనాలు, పూజారి పెళ్లి మంత్రాలు, మొత్తం వేడుకంతా అదిరిపోయింది. గుజరాతీ సంప్రదాయ బద్ధంగా జరిగిందీ పెళ్లి. అయితే.. పెళ్లి కూతురు మాత్రం లేదు. వినడానికి వింతగా ఉన్నా… ఇది నిజం.
గుజరాత్ లోని శబరికాంత జిల్లాలోని చంప్లనార్ ఊరు ఈ వెరైటీ వెడ్డింగ్ కు వేదికైంది. అజయ్ బరాట్ అనే వ్యక్తిని సంతోష పెట్టడానికి కుటుంబమంతా ఏకమై ఈ పెళ్లి వేడుకను నిర్వహించింది. అజయ్ మానసిక వైకల్యంతో బాధ పడుతున్నాడు. తనకూ అందరిలాగే పెళ్లి చేసుకోవాలని ఉన్నా.. పిల్లను ఎవరూ ఇవ్వకపోవడంతో అతన్ని సంతోష పెట్టడానికి అచ్చం పెళ్లిలో జరిగే కార్యక్రమాలన్నీ నిర్వహించారు బంధువులు.