కేరళ సీఎం ఎవరు? రేసులో ఉన్నది వీళ్లే..

కేరళ సీఎం ఎవరు?  రేసులో  ఉన్నది వీళ్లే..
  • రేసులో వీడీ సతీశన్, 
  • రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, శశి థరూర్
  • నలుగురిలో బలంగా వినిపిస్తున్న సతీశన్ పేరు
  • కాంగ్రెస్​ అధిష్టానం నిర్ణయమే ఫైనల్

తిరువనంతపురం: దశాబ్ద కాలం తర్వాత కేరళలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి పాలనాపగ్గాలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూడీఎఫ్  ఘనవిజయంతో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కొత్త సీఎం ఎంపికపై కసరత్తు మొదలైంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. 2023లో మాజీ సీఎం ఉమెన్ చాందీ మరణానంతరం.. పార్టీ సమిష్టి నాయకత్వంతో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. గతంలో కాంగ్రెస్‌ను వేధించిన గ్రూపు రాజకీయాలను ఈ ఎన్నికల్లో పార్టీ సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది.

పోటీలో సీనియర్​ నాయకులు

ప్రస్తుతం కేరళ సీఎం రేసులో కాంగ్రెస్​ పార్టీ సీనియర్​లీడర్లు వీడీ సతీశన్, రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, శశి థరూర్ సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ పేరు ఈ రేసులో బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక తీర్మానం చేసి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ హైకమాండ్‌కు అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం ఏకే ఆంటోనీ అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ కొత్త సీఎం ఎంపికలో 


కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుత ప్రతిపక్ష నేత వీడీ సతీశన్..

 కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఐదేండ్లుగా కేరళ అసెంబ్లీలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సమర్థవంతంగా పోరాడుతున్నారు.

రమేష్ చెన్నితాల..

మాజీ ప్రతిపక్ష నేత, సీనియర్ నాయకుడు. పార్టీలో భారీ అనుభవం ఉన్న నాయకుడు కావడం ఈయనకు ప్లస్ పాయింట్. ఆయన కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐకి అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రం వెలుపల కూడా పార్టీలో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.

కేసీ వేణుగోపాల్..

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఈయనను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకువస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే,  రాహుల్ గాంధీకి ఆయన నమ్మకస్తుడు. అయితే, ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

శశి థరూర్..

తిరువనంతపురం ఎంపీ. యువత, విద్యావంతుల్లో ఈయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈయన పేరు రిశీలనలో ఉంది. ఢిల్లీ మీడియా వర్గాల్లో థరూర్ పేరు సీఎం అభ్యర్థిగా వినిపిస్తోంది. ఆయనకు జాతీయ స్థాయిలో కూడా గణనీయమైన గుర్తింపు ఉంది.