అనుమతిలేకుండా వెంచర్లు : జోరుగా రియల్ వ్యాపారం

అనుమతిలేకుండా వెంచర్లు : జోరుగా రియల్ వ్యాపారం

నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల స్థలాలు కబ్జా అవుతున్నాయి. ప్రభుత్వం యాదగిరీశుని ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో.. అక్కడి భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో కొంతమంది వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి ప్లాట్లను అమ్మేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా యాదాద్రి మున్సిపాలిటీ పరిధిలోనే 74 ఎకరాల్లో వెంచర్లు వేశారని.. పట్టణ ప్రగతిలో గుర్తించారు అధికారులు.

కొత్తగా ఏర్పాటైన చండూరు మున్సిపాలిటీలో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేటతో పాటు మిర్యాలగూడ.. కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డ యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరుల్లో అక్రమ వెంచర్లు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. నాలుగైదేళ్లుగా ఈ దందా సాగుతున్నా…. మామూళ్ల మత్తులో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమ వెంచర్ల దందా చేసే వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయినా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికారులు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే అనుమతులు లేని వాటికి నోటీసులు అంటించడం, సరిహద్దు రాళ్లు తొలగించి చేతులు దులుపుకుంటున్నారు.

HMDA పరిధిలో ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీలోనూ అడ్డగోలుగా వెంచర్లు వెలుస్తున్నాయి. అయితే చౌటుప్పల్ లో ఒక్క అక్రమ లేఅవుట్ కూడా లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అక్రమ లేఅవుట్ల వ్యవహారం బయటపడుతుందని చెప్తున్నారు స్థానికులు.