విమానంలో సీటుపై పడుకుని సిగరెట్ కాల్చిన ప్రయాణికుడు

విమానంలో సీటుపై పడుకుని సిగరెట్ కాల్చిన ప్రయాణికుడు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయాలంటే పక్కవారు ఏ మనుకుంటారో పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమో అని భయపడిపోతుంటారు.  కానీ ఓ ప్రయాణికుడు మాత్రం ఏకంగా స్పైస్ జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ SG 706  విమానంలో దర్జాగా పడుకుని సిగరెట్ తాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. అది కూడా కాలి మీద కాలు వేసుకుని ధూమపానం చేశాడు. అతడి ప్రవర్తనతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విమానంలో సిగరెట్ తాగటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీనిపై సీరియస్ అయిన మంత్రి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 

గుర్గావ్ కు చెందిన బాబీ కటారియా ఎయిర్ క్రాప్ట్ విమానంలో సీటుపై పడుకుని సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. ఈ వీడియోను కొందరు ప్రయాణికులు చిత్రీకరించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు సదరు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. తాను విమానంలో సిగరెట్ కాల్పడంపై కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో విమర్శలు చేయడంపై కటారియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపిస్తుందని ఆరోపించారు.  రేటింగ్స్ ను పెంచుకునేందుకు ఇష్టమొచ్చినట్టు తనపై కథనాలు అల్లుతుందని ట్విట్టర్ వేధికగా విమర్శలు చేశారు. 


కటారియా చర్యల వల్ల ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారని అధికారులు తెలిపారు. విమానంలో ఒత్తిడితో కూడిన క్యాబిన్‌లో ధూమపానం చేయడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. మన దేశంలో  విమానంలో ప్రయాణించే  ప్యాసింజర్స్ లోపల ధూమపానం చేయడాన్ని నిషేధించారు. కానీ సదరు వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై అతనిపై తగు చర్యలు తీసుకుంటామనిచెప్పారు. ఈ ఏడాది జనవరి 20న దుబాయ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన SG 706 విమానంలో ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కుతుండగా ఈ వీడియోను చిత్రీకరించారని తెలిపారు. క్యాబిన్ సిబ్బంది ఆన్-బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేస్తున్నప్పుడు 21వ వరుసలో ఉన్న  కటారియా సిగరెట్ కాలుస్తుండగా అతని సహ ప్రయాణీకులు ఈ వీడియోను షూట్ చేశారు.  సోషల్ మీడియా ద్వారా  జనవరి 24, 2022న ఎయిర్‌లైన్ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆ ప్రయాణికుడిని 15 రోజుల పాటు విమానయాన సంస్థ నో-ఫ్లైయింగ్ లిస్ట్‌లో ఉంచిందని స్పష్టం చేశారు.