- మృతదేహాల తరలింపును పర్యవేక్షిస్తున్న ఎంబసీ
హనోయ్: వియత్నాంలోని పర్యాటక దీవి ఫు క్వాక్ సమీపంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో 15 మంది భారతీయుల మృతికి 'నిర్లక్ష్యమే' ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సముద్రంలో వాతావరణం అనుకూలించని సమయంలో, ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి బోటు నడిపిన 57 ఏళ్ల కెప్టెన్ ఎన్గుయెన్ హాంగ్ హైను వియత్నాం పోలీసులు అరెస్టు చేశారు. పర్యాటకుల ప్రాణాల కంటే తన వ్యాపారానికే ప్రాధాన్యత ఇచ్చిన కెప్టెన్ నిర్లక్ష్యం, ఇప్పుడు 15 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.
కాగా, ఈ దుర్ఘటనలో పదిహేను మంది భారతీయులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నానికి మృతదేహాలు హోచిమన్ సిటీకి చేరాయని, ఫార్మాలిటీస్ పూర్తిచేసి వీలైనంత తొందరగా వాటిని ఇండియాకు పంపిస్తామని అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) వేగవంతం చేసింది. ఎప్పటికప్పుడు అధికారులు, బాధిత కుటుంబాలతో ఇండియన్ ఎంబసీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 16 మంది భారతీయులు చికిత్స అనంతరం స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. మరొకరు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎంబసీ అధికారులు తెలిపారు.
ప్రమాదానికి కారణాలివే..
ప్రమాదం జరిగిన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన కెప్టెన్, నిబంధనలను బేఖాతరు చేస్తూ పర్యాటకులతో బోటును నడిపాడు. భద్రతా నిబంధనలను బేఖాతరు చేస్తూ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ దురదృష్టకర ఘటనకు దారితీసినట్లు అధికారులు గుర్తించారు. బోటు బోల్తా పడిన తర్వాత కెప్టెన్ ప్రమేయంపై సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు అతని నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ దుర్ఘటనపై వియత్నాం ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రధానమంత్రి లే మిన్ హంగ్ నేరుగా ఈ కేసుపై దృష్టి సారించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల ప్రత్యక్ష మరియు పరోక్ష కారణాలను విశ్లేషించి, బాధ్యులెవరైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా పర్యాటక బోట్ల భద్రతా తనిఖీలను కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
