
వెట్రిమారన్(Vetrimaran) సినిమాలకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. తెలుగులో డబ్ చేసిన పందెం కోడి, నారప్ప వంటి సినిమాలకు ఇతనే ఒరిజినల్ దర్శకుడు. తమిళంలో విజయ్ సేతుపతి(Vijay sethupathi) ‘విడుదలై’ అనే సినిమా విమర్శల ప్రశంసలందుకుంది. ఈ సినిమాతో వెట్రిమారన్ మరో హిట్టందుకున్నాడు.
ఈ సినిమాను ‘విడుదల పార్ట్ 1’గా తెలుగులోకి డబ్ చేయనున్నారు. తమిళంలో స్టార్ కమెడియన్ గా పేరున్న సూరి ఈ సినిమాలో సీరియస్ పాత్రలో నటించాడు. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తుండటంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. తలైవా రజనీకాంత్ ను సైతం ఈ సినిమా ఆకట్టుకుంది.
ట్రైలర్ చూస్తే ఇదొక పీరియాడికల్ సినిమాగా తెలుస్తోంది. ఎప్పటిలాగే విజయ్ సేతుపతి రా అండ్ రస్టిక్ లుక్ తో అదరగొట్టాడు. అణగారిని వర్గాల కోసం పోరాడే పెరుమాళ్ అనే నాయకుడిగా హీరో కనిపించనున్నాడు. ఆపరేషన్ ఘోస్ట్ హంట్ పేరుతో విజయ్ కోసం పోలీసులు గాలిస్తుంటారు.
కులం అనే మరో సామాజిక అంశాన్ని దర్శకుడు సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. సహజమైన యాక్షన్ సన్నివేశాలు, అక్కడక్కడా ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ ను ఇంట్రెస్టింగ్ గా మలిచారు. గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించాడు. ఏప్రిల్ 15న సినిమాను విడుదల చేయనున్నారు.