విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ మెలిక : 118 మంది మద్దతు కావాల్సిందే అంటూ ఆదేశం

విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ మెలిక : 118 మంది మద్దతు కావాల్సిందే అంటూ ఆదేశం

తమిళనాడులో నెంబర్ గేమ్ నడుస్తోంది. ఎన్నికల ఫలితాలలో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అందుకోసం మద్ధతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తమకు 112 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది.. ప్రభుత్వ ఏర్పాటుకు పిలవండని టీవీకే చీఫ్​ విజయ్.. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను 2026 మే 6న కలిశారు. 

ఈ సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. 112 ఎమ్మెల్యేల మద్ధతు సరిపోదు.. 118 మందితో రమ్మని గవర్నర్ సూచించారు. గవర్నర్ వ్యాఖ్యలతో తమిళనాట రాజకీయాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి.  ఇప్పటికే 112 మంది మద్ధతు ఉందని విజయ్ చెప్పారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేలు మద్ధతిస్తున్నట్లు పరోక్షంగా చెప్పారు. దీంతో దాదాపు మ్యాజిక్ ఫిగర్ వచ్చినట్లే. అయినా గవర్నర్ అలా చెప్పడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే మద్ధతు అనేది నోటిమాటగా కాదని.. రాత పూర్వకంగా నిరూపించుకోవాల్సి ఉంటుందని గవర్నర్ ఉద్దేశమని అంటున్నారు. 

►ALSO READ | విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఇదే : గవర్నర్ ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్

తమిళనాడులో డీఎంకే తో పాటు అన్నాడీఎంకే కూటములను కాదని.. అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది తమిళగ వెట్రి కజగం (టీవీకే). 108 స్థానాలు సాధించి సినిమాల్లోనే కాదు.. పాలిటిక్స్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్నారు విజయ్. అయితే మ్యాజిక్ ఫిగర్ కు 10 స్థానాలు తక్కువగా రావటంతో నెంబర్ గేమ్ మొదలైంది. 

ఇప్పటికే కొన్ని పార్టీలు టీవీకేకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించాయి.  అయితే డీఎంకే మిత్రపక్షమైన విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే), గురువారం (మే 07) ఉదయం 10 గంటలకు ఒక కీలక సమావేశం నిర్వహించి తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఇక లెఫ్ట్ పార్టీలు  తమ నిర్ణయాన్ని మే 8వ తేదీకి (శుక్రవారం) వాయిదా వేశాయి. టీవీకే అభ్యర్థనను ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. వీసీకే, వామపక్ష పార్టీలు రెండూ డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ)లో ఉండటంతో నిర్ణయం తీసుకోవడానికి కాస్త వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.