V6 News

ఇక ఆన్​లైన్​లోనూ ‘విజయ’ సరుకులు

ఇక ఆన్​లైన్​లోనూ ‘విజయ’ సరుకులు
  • నెలాఖరుకల్లా ఈ-కామర్స్‌‌‌‌ సైట్లలో అందుబాటులోకి తేనున్న ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌
  •     బిగ్‌‌‌‌ బాస్కెట్‌‌‌‌, జియోమార్ట్‌‌‌‌, స్విగ్గి, బ్లింకిట్‌‌‌‌, జెప్టో సంస్థలతో త్వరలో ఒప్పందం 
  •     నూనెలు, బియ్యంతో పాటు 23 రకాల సరుకుల అమ్మకం 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రోజురోజుకూ ఈ–కామర్స్‌‌‌‌, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మార్కెటింగ్ యాప్ లు, సైట్లకు డిమాండ్‌‌‌‌ పెరుగుతుండటంతో ‘విజయ’ బ్రాండ్‌‌‌‌ వంట సరుకులను కూడా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లో విక్రయించాలని ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌ నిర్ణయించింది. దీనికి సంబంధించి బిగ్‌‌‌‌ బాస్కెట్‌‌‌‌, జియో మార్ట్‌‌‌‌, స్విగ్గి, బ్లింకిట్‌‌‌‌, జెప్టో వంటి ప్రముఖ ఈ-–కామర్స్‌‌‌‌ సంస్థలతో త్వరలోనే ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్లో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ హవా కొనసాగుతున్న  పరిస్థితుల్లో మార్కెట్లో పోటీ తట్టుకోని, వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు గాను ఆయిల్ ఫెడ్ కూడా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌లోకి ప్రవేశించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు సంస్థ వినియోగదారులకు నాణ్యమైన సరుకులను వేగంగా అందించేందుకు వీలుగా ఈ–కామర్స్‌‌‌‌లో అడుగుపెట్టాలని ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌ నిర్ణయం తీసుకుంది. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోకి ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌.. 

ఆయిల్ ఫెడ్ గతంలో వంట నూనెలు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత వంట సరుకులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం విజయ బ్రాండ్‌‌‌‌ పేరుతో వేరుశనగ, రైస్‌‌‌‌బ్రాన్‌‌‌‌, పామాయిల్‌‌‌‌, సన్‌‌‌‌ ఫ్లవర్‌‌‌‌, దీపం, గానుగ నూనె, కొబ్బరి నూనెతో పాటు హెచ్‌‌‌‌ఎంటీ, సోనామసూరి సన్న బియ్యం, పప్పులు ఇలా30 రకాలకు పైగా సరుకులను బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. క్రమంగా విజయ సరుకులకు మార్కెట్‌‌‌‌లో డిమాండ్‌‌‌‌ పెరిగింది. దీంతో వినియోగదారులకు మరింత ఈజీగా సరుకులను అందించేలా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనూ అందుబాటులో తేవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ–కామర్స్‌‌‌‌ సంస్థలతో ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌ అధికారులు సంప్రదింపులు జరిపారు. పలు మార్కెటింగ్‌‌‌‌ సంస్థలతో ఒప్పందం చేసుకుని, ఈ నెలాఖరు వరకు విజయ బ్రాండ్‌‌‌‌ సరుకులను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ఎండీ సురేందర్‌‌‌‌ తెలిపారు.