సీఎం పర్యటన సమయంలో అపశృతి.. ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు

సీఎం పర్యటన సమయంలో అపశృతి.. ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు

అమ‌రావ‌తి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో 5 వ రోజైన ఈ బుధ‌వారం దుర్గమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈరోజు ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడడంతో కలకలం రేగింది. భారీ వర్షాల వలన రెండు మూడు రోజులుగా కొండ‌పై నుంచి చిన్న చిన్న రాళ్లు విరిగిపడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే అధికారులు.. కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసారు.

అయితే ఈ బుధ‌వారం సీఎం జగన్ అమ్మ‌వారిని ద‌ర్శించుకోకున్న నేపధ్యంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనతో అధికారులలో ఆందోళన నెలకొంది. దర్శనం కోసం వెళ్ళే భక్తుల కోసం వేసిన టెంట్ లు అన్నీ ఈ కొండ చరియల వలన ద్వంసం అయ్యాయి. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులపై అవి పడటంతో వారు గాయాల పాలయ్యారు. కొండచరియలు విరిగి పడిన సమయంలో ఆలయ సిబ్బంది కూడా కొందరు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. వారికి కూడా గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు బాధితులకు తక్షణ సాయం అందించారు. ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టారు.

కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో దుర్గమ్మ దర్శనానికి వస్తున్న సీఎం జగన్ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేశారు. ప్రధాన ద్వారం గుండా కాకుండా మహామండపం లిఫ్ట్‌ మార్గంలో సీఎం జగన్‌ దర్శనానికి వెళ్తున్నారు. జగన్‌ రాక సందర్భంగా భారీ బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం జగన్ సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి దర్శనానికి రావాల్సి ఉంది. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాక జగన్ తిరిగి వెళతారు.