తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ప్రభంజనం.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా తమిళవెట్రి కజగం(టీవీకే) అవతరించింది. అధికార పీఠం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ట్రెండ్స్ లోనే 100 స్థానాల్లో టీవీకే అధిక్యంలో ఉంది. టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 234 శాసనసభ స్థానాలకు ఫలితాలు వెలువడుతున్నాయి. సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి 79 స్థానాలు, డీఎంకే 50స్థానాలతో మూడో స్థానంలోఉంది. ఎన్నికల ఫలితాలు చాలా ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనాలకంటే భిన్నంగా వెలువడుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా, చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తమిళనాడులో నిజమవుతున్నాయి.
ఏప్రిల్ 23న తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో 85 శాతానికి పైగా బలమైన ఓటింగ్ నమోదైంది. కట్టుదిట్టమైన భద్రత, పకడ్బందీ ప్రణాళికలతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. తమిళనాడులో ఎన్నికల పోరు ప్రధానంగా అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), ప్రతిపక్ష ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) చుట్టూ తిరిగింది. నటుడు విజయ్ పార్టీ, తమిళగ వెట్రి కజగం (టీవీకే), కొత్తగా రంగప్రవేశం చేయడంతో అందరి దృష్టి ఆ పార్టీ ఉంది. బరిలో ఉన్న ఇతర పార్టీలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్, నామ్ తమిళర్ కచ్చి (ఎన్‌టీకే), వీసీకే, పీఎంకే ఉన్నాయి.
2021లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి 159 స్థానాలు గెలుచుకుని ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. పదేళ్ల ప్రతిపక్షం తర్వాత ఇది వారి పునరాగమనాన్ని సూచిస్తుంది. ఏఐఏడీఎంకే కూటమి 75 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష పాత్రలో నిలిచింది.
