నీళ్ల కోసం యుద్ధానికి సిద్ధం.. భారతదేశాన్ని హెచ్చరించిన పాక్ రక్షణ మంత్రి

నీళ్ల కోసం యుద్ధానికి సిద్ధం.. భారతదేశాన్ని హెచ్చరించిన పాక్ రక్షణ మంత్రి

భారత్, పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమ దేశ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్‌తో యుద్ధానికైనా సిద్ధమంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండగా.. తాజా వ్యాఖ్యలు యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

నీరు అనేది తమ దేశానికి అత్యంత కీలకమైన జాతీయ భద్రతతో కూడుకున్న అంశమని పాకిస్తాన్‌కు చెందిన ఏఆర్వై న్యూస్ ఛానల్‌తో ఖవాజా ఆసిఫ్ కామెంట్ చేశారు. ఏ క్షణంలోనైనా తమ జాతీయ భద్రతకు, ముఖ్యంగా నీటి సరఫరాకు భారత్ వల్ల ముప్పు పొంచి ఉందని భావిస్తే.. తాము ఖచ్చితంగా భారత్‌తో యుద్ధానికి వెళ్తామని అన్నారు. ఇప్పటికే తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. ఒకవేళ భారత్ నదీ జలాల ప్రవాహాన్ని వేగంగా నియంత్రించడానికి, దారి మార్చడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

►ALSO READ | ఇరాన్ – అమెరికా చర్చలపై మార్కెట్ ఫోకస్‌‌... కొనుగోలుదారులుగా మారిన ఎఫ్‌‌ఐఐలు

భారత జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బయటకు రావడం పాక్ మంత్రి తాజా హెచ్చరికకు కారణమైంది. జూన్ 2028 నాటికి పాకిస్తాన్‌కు వెళ్లే సింధు నదీ జలాల ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందనేలా ఆ వీడియోలో సంకేతాలు ఉన్నాయి. దీంతో పాక్ తీవ్ర ఆందోళన చెందుతోంది.

అసలు వివాదం గతేడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో మొదలైంది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. దీనికి పాక్ సపోర్ట్ ఉన్న ఉగ్రవాదులే కారణమని భారత్ మండిపడింది. క్రాస్-బోర్డర్ ఉగ్రవాదంపై పాకిస్తాన్ కఠినమైన చర్యలు తీసుకునే వరకు 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం తర్వాత ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం సుమారు 80 శాతం నీరు పాకిస్తాన్‌కే వెళ్తుంది. ఇది అక్కడి వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాడు లాంటిది. ఈ నేపథ్యంలో భారత్ నీటిని నిలిపివేస్తే కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడతారని, యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ కోరారు. అలాగే చినాబ్ నది నీటిని మళ్లించేందుకు భారత్ నదుల అనుసంధాన ప్రాజెక్టును నిర్మిస్తోందని కూడా పాక్ ఆందోళన చెందుతోంది.