- వార్షిక నేర వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ స్పేహ మెహ్రా
వికారాబాద్, వెలుగు : వికారాబాద్‌జిల్లాలో గత ఏడాదితో పోలుస్తే ఈ యేడాది క్రైం రేట్ స్వల్పంగా పెరిగిందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్రా వార్షిక నేర నివేదికపై మీడియా సమావేశం నిర్వహించారు. గత యేడాది నవంబర్ నాటికి 3,691 కేసులు నమోదైతే ఈసారి 3,813 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ లెక్కన ఈయేడాది 3.31శాతం నేరాలు స్వల్పంగా పెరిగాయన్నారు.
శాంతిభదత్రలను పరిరక్షించడంతో పాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండగతో పాటు న్యూఇయర్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ వ్యవస్థను ఇంకా స్మార్ట్‌గా పని చేసేవిధంగా తీర్చిదిద్దుతామన్నారు.
షీ టీంలను కూడా ఇంకా బలోపేతం చేస్తామని వివరించారు. ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతామన్నారు. మహిళలు చిన్న సమస్య వచ్చినా ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రత్యేకంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి పెడుతామని పేర్కోన్నారు. ఈ మీడియా సమావేశంలో డీసీఆర్డీ డీఎస్పీ జానయ్య, వికారాబాద్, పరిగి, తాండూర్ డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, నార్సింగ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ సేవల్లో ప్రతిభ కనబర్చిన అధికారులను అభినందన..
తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ అడిషనల్ డీజీపీ వివి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులను వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో జిల్లా ఐటీ హెడ్ కాన్స్టేబుల్ ఎం. కేశవులు, పిసి శివ శంకర్, పరిగి పోలీస్ స్టేషన్ ఈ- కాప్స్ కానిస్టేబుల్ బక్కా రెడ్డి, యాలాల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సందీప్ ఉన్నారు.
