కొత్త సీఎస్ ఎవరు... రేసులో వికాస్ రాజ్, జయేశ్‌‌‌‌ రంజన్ 

కొత్త సీఎస్ ఎవరు... రేసులో వికాస్ రాజ్, జయేశ్‌‌‌‌ రంజన్ 
  • తొమ్మిది రోజుల్లో ముగియనున్న సీఎస్‌‌‌‌ రామకృష్ణారావు పదవీ కాలం
  • 10 నెలలుగా ఎక్స్​టెన్షన్ మీద కొనసాగుతున్న ప్రస్తుత సీఎస్‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నియామకంపై సెక్రటేరియెట్‌‌‌‌తో పాటు బ్యూరోక్రసీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత సీఎస్ కె.రామకృష్ణారావు పదవీ కాలం మరో 9 రోజుల్లో (జూన్ 30తో) ముగియనుండటంతో కొత్త బాస్ ఎవరనే దానిపై సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. నిజానికి 1991 బ్యాచ్‌‌‌‌కు చెందిన ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు గతేడాది ఆగస్టులోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం తొలుత 7 నెలలు, ఆ తర్వాత మరో 3 నెలల చొప్పున మొత్తంగా 10 నెలలు పొడిగింపు కల్పించింది.

మరోసారి ఎక్స్‌‌టెన్షన్‌‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్రానికి ప్రపోజల్స్ పంపలేదు. దీంతో ఆయనకు మూడోసారి పొడిగింపు లభించే అవకాశాలు దాదాపు లేవని సెక్రటేరియేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎస్ పీఠం కోసం 1992 బ్యాచ్‌‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న వికాస్ రాజ్, జయేశ్‌‌ రంజన్‌‌ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పరిశీలిస్తోంది. 

అత్యంత సీనియర్ అయిన శశాంక్ గోయల్ (1990 బ్యాచ్) ఈ ఏడాది సెప్టెంబర్‌‌లోనే రిటైర్ కానుండటం, మరో సీనియర్ అరవింద్ కుమార్ సస్పెన్షన్‌‌లో ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి ఇప్పుడు వికాస్ రాజ్, జయేశ్‌‌ రంజన్‌‌లపై నిలిచింది. జయేశ్ 2027 సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈయనకు సీఎస్ పదవి దక్కితే 15 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. అదే వికాస్ రాజ్‌‌కు దక్కితే దాదాపు రెండేండ్లు (3 నెలలు తక్కువ) సీఎస్ పదవిలో కొనసాగుతారు. 

అదృష్టం ఎవరిదో..

జయేశ్‌‌ రంజన్‌‌, వికాస్‌‌ రాజ్‌‌లలో ఎవరిని అదృష్టం వరిస్తుందోనన్న దానిపై సెక్రటేరియెట్‌‌ కారిడార్లలో భిన్నమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసి, అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన వికాస్ రాజ్‌‌కు క్షేత్రస్థాయి పరిపాలనపై పట్టుంది. ప్రస్తుతం ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్‌‌గా వరంగల్ ఎయిర్‌‌‌‌పోర్టు, ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్ అనుమతులు, ఇతర గ్రీన్ ఫీల్డ్ హైవేలు, హ్యామ్ రోడ్ల విషయంలో ఆయన పనితీరుపై సీఎం సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జయేశ్‌‌ రంజన్ రేసు కూడా అదే స్థాయిలో ఉన్నారు.  

గత ప్రభుత్వ హయాంలో సుదీర్ఘకాలం పాటు ఐటీ, పరిశ్రమల శాఖల కార్యదర్శిగా పనిచేసి ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థల పెట్టుబడులను హైదరాబాద్‌‌కు రప్పించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. కాంగ్రెస్‌‌ ప్రభుత్వంలోనూ అదే పనితీరును కనబర్చారు. గత మూడేండ్లుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం, రాష్ట్రంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌‌లో భారీగా పెట్టుబడులు తెప్పించారు. తాజాగా మున్సిపల్ స్పెషల్ సీఎస్‌‌గా పనుల్లో తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. 

పైగా ఆ శాఖను నేరుగా సీఎం సమీక్షిస్తుండటం గమనార్హం. అంతర్జాతీయ కార్పొరేట్ వర్గాలతో ఉన్న సంబంధాలు, నగర అభివృద్ధిపై ఉన్న విజన్ ఆయనకు సానుకూల అంశాలుగా మారాయి. అయితే సర్కారు ప్రాధాన్యతలకు అనుగుణంగా మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను వేగవంతం చేయడంలో జయేశ్‌‌ రంజన్‌‌ అనుభవం ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జయేశ్‌‌ రంజన్‌‌కు ఇస్తే వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు అంటే (ఒక సంవత్సరం 3 నెలల కాలం) పదవిలో ఉంటారు. 

మరో ఇద్దరి పేర్లు తెరపైకి..

కేంద్ర డిప్యూటేషన్‌‌లో ఉన్న సంజయ్ జాజు (1992 బ్యాచ్) పేరు కూడా సీఎస్‌‌ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ సెక్రటరీగా ఉన్నారు. అయితే స్థానికంగా అందుబాటులో ఉన్న  ఇద్దరిలోనే ఒకరికి సీఎస్ పగ్గాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. 

అలాగే, స్పెషల్ సీఎస్ సవ్యసాచి ఘోష్ పేరు కూడా సీఎస్‌‌ రేసులో వినిపిస్తున్నప్పటికీ.. ఆయన 1994 బ్యాచ్ కావడం, జిల్లాల్లో ముఖ్యమైన శాఖల్లో పనిచేసిన అనుభవం లేకపోవడంతో ఆయనపై ప్రభుత్వం ఆసక్తిగా లేనట్లు తెలిసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రామకృష్ణారావు ఎక్స్‌‌టెన్షన్‌‌ కోసం లేఖ రాసి గట్టి ప్రయత్నాలు చేస్తే చివరి నిమిషంలో సమీకరణాలు మారే అవకాశం కూడా లేదనే చర్చ జరుగుతున్నది.