భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రత్యేకతలు ఇవే..

 భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రత్యేకతలు ఇవే..

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ తన తొలి ప్రయాణంలోనే అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్‌‌‌‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ తయారు చేసిన ఈ రాకెట్ పేలోడ్‌‌‌‌లను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. శనివారం మధ్యాహ్నం12.05 గంటలకు ఆంధ్రప్రదేశ్‌‌‌‌ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి విక్రమ్-1 రాకెట్ నారింజ రంగు మంటలు చిమ్ముతూ మేఘావృతమైన ఆకాశంలోకి దూసుకెళ్లింది. 

విక్రమ్-1 ప్రత్యేకతలు ఇవే..

    దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ - క్లాస్ లాంచ్ వెహికల్. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరిట నామకరణం చేశారు.
    350 కిలోల పేలోడ్లను 450 కి.మీ. ఎత్తులోని కక్ష్యకు, 260 కిలోల పేలోడ్‌‌‌‌‌‌‌‌లను సన్ సింక్రోనస్ ఆర్బిట్‌‌‌‌‌‌‌‌లోకి చేర్చగలదు.  
    తేలికగా, అత్యంత బలంగా ఉండేందుకు రాకెట్ బాడీని అత్యాధునిక ఆల్-కార్బన్ కాంపోజిట్స్‌‌‌‌‌‌‌‌తో తయారు చేశారు.
    కనీస గ్రౌండ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌తో, తక్కువ సమయంలోనే ఆన్-డిమాండ్ లాంచ్ సేవలను అందించేలా రూపొందించారు. దీనివల్ల కేవలం కొన్ని రోజుల్లోనే రాకెట్ అనుసంధానం, ప్రయోగానికి సిద్ధం చేయడం సాధ్యమవుతుంది.
    నిర్మాణ బరువు, తయారీ సంక్లిష్టతను తగ్గించడానికి అత్యాధునిక త్రీడీ-ప్రింటెడ్ ఇంజన్లను, మోడ్యులర్ ఏవియానిక్స్‌‌‌‌‌‌‌‌ను ఇందులో ఉపయోగించారు.
    20 మీటర్ల నుంచి 24 మీటర్లు (ఏడంతస్తుల భవనం అంత ఎత్తు).. 1.7 మీటర్ల వెడల్పు ఉంటుంది. 
    రాకెట్​కు 4 దశలు (3 సాలిడ్-ఫ్యూయల్ + 1 లిక్విడ్-ఫ్యూయల్ అప్పర్ స్టేజ్). వీటిలో మొదటి 3 దశల ఇంజన్‌‌‌‌‌‌‌‌లకు అబ్దుల్ కలాం పేరును, నాలుగో దశ ఇంజన్‌‌‌‌‌‌‌‌కు సర్ సీవీ రామన్ పేరును పెట్టారు.

విక్రమ్1 కక్ష్యలోకి చేర్చిన పేలోడ్‌‌‌‌‌‌‌‌లు, వస్తువులు ఇవే.. 

విక్రమ్ 1 రాకెట్ ప్రాథమిక పేలోడ్లు అయిన గ్రహా స్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్, స్కైరూట్ సంస్థకు చెందిన స్కోప్ శాటిలైట్‌‌‌‌‌‌‌‌లను వరుసగా 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటిలో స్కైరూట్ రూపొందించిన స్కోప్ శాటిలైట్ అనేది భవిష్యత్తు మిషన్లలో అంతరిక్ష సాంకేతికతలను పరీక్షించడా నికి అభివృద్ధి చేసిన అంతర్గత ప్రయోగాత్మక పేలోడ్. విక్రమ్-1 మోసుకెళ్లిన పేలోడ్లలో కాస్మోసర్వ్ స్పేస్ సంస్థకు చెందిన ‘ఎంబ్రేస్’ కూడా ఉంది. గ్రహా స్పేస్ అభివృద్ధి చేసిన సొలారస్ అనే చిన్న ఉపగ్రహం కూడా ఈ మిషన్‌‌‌‌‌‌‌‌లో అంతరిక్షానికి చేరింది. ఇక కాస్మోస్ డైమండ్స్ సంస్థకు చెందిన ‘ఆర్టిస్టిక్ ల్యాబ్-గ్రోన్ డైమండ్’ అయిన కాస్మిక్ బ్లూమ్, జర్మన్ టెస్ట్ పేలోడ్‌‌‌‌‌‌‌‌లు యూడీ3పీపీ, ఎండీ3ఆర్ఎన్‌‌‌‌‌‌‌‌ కూడా డీక్యూబ్డ్ ద్వారా అంతరిక్షానికి చేరాయి. వీటితోపాటు ఒక మైక్రో-ఆర్ట్ పేలోడ్, 18- క్యారెట్ల బంగారు రాకెట్ మోడల్, ప్రధాని మోదీ నుంచి  ‘వందేమాతరం’ సందేశం ఉన్న చేతితో రాసిన పోస్ట్‌‌‌‌‌‌‌‌కార్డుతోపాటు ఇంజనీర్లు, సైంటిస్టులు, భారతీయ వ్యోమగాముల నుంచి సేకరించిన పోస్ట్‌‌‌‌‌‌‌‌కార్డులను కూడా కక్ష్యలోకి విడిచిపెట్టింది.