విశ్వ నటుడు కమల్ హసన్ ఇంటర్వ్యూ

విశ్వ నటుడు కమల్ హసన్ ఇంటర్వ్యూ

కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్ హాసన్తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక  చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఆర్ మహేంద్రన్తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. మూవీలో స్టార్ హీరో సూర్య ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ 'శ్రేష్ఠ్ మూవీస్' ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనుంది. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో 'విక్రమ్' చిత్ర విశేషాలను కమల్ హాసన్ మీడియాతో  పంచుకున్నారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్ను  కలిశారు కదా.. మీ మధ్య ఏ అంశాలు చర్చలోకి వస్తుంటాయి? 
మేం తరచుగా కలుస్తూనే వుంటాం. గత 40 ఏళ్లుగా ఇది జరుగుతూనే వుంది. మా సినిమాలు గురించి, స్నేహితుల గురించి సరదాగా మాట్లాడుకుంటాం. 'విక్రమ్ సినిమాకి చాలా మంచి వైబ్స్ ఉన్నాయి, కంగ్రాట్యులేషన్స్ '' అని రజనీ చెప్పారు. 

రాజకీయాలు గురించి మాట్లాడుతుంటారా ? 
చాలా తక్కువ. మా ఇద్దరిది భిన్నమైన ఫిలాసఫీ. మేము ఎప్పుడూ పొలిటికల్ డిబేట్స్ జోలికి వెళ్ళం. మా స్నేహానికి గౌరవిస్తాం. 

'విక్రమ్' ట్రైలర్ లో అడవిలో వేట అన్నట్టుగా చూపించారు. వేటకి సంబధించిన ఫిలాసఫీ కూడా చెప్పారా ? 
ఇది కాంక్రీట్ జంగిల్ అనుకుంటే ఇది కూడా అడవే.  క్రైమ్ విషయానికొస్తే మనిషిని వేటాడే జంతువులా మారిపోయాడు మనిషి. అనుకోకుండా ఇలాంటి అడవిలో మనమంతా బాగస్వాములుగా ఉన్నాం. విలన్ అనే వాడు మార్స్ నుండి దిగిరాడు.  విక్రమ్ కథలో ఇలాంటి అంశాలన్నీ చూడబోతున్నాం. ఇందులో ప్రతి పాత్రకు రెండు కోణాలుంటాయి. విక్రమ్ డార్క్ మూవీ. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. విక్రమ్ గ్రేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అందుకే అందరూ సినిమాను థియేటర్స్ లోనే  చూసి ఎంజాయ్ చేయండి. 

ఇంతకీ ఇందులో విక్రమ్ ఎవరు ?
ఇది ముందే చెప్పేస్తే ఇంక మ్యాజిక్ ఏముంటుంది. మెజీషియన్ తన హార్ట్ నుండి రాబిట్ తీస్తాడు. ఇది అసంభవమని మనకి తెలుసు. కానీ అది ఎలా తీశాడో మెజీషియన్ చెప్పడు. అదే మ్యాజిక్ (నవ్వుతూ). విక్రమ్ ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. (నవ్వుతూ)

హీరో నితిన్ హోమ్ బ్యానర్ 'శ్రేష్ఠ్ మూవీస్' ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా విడుదల చేస్తున్నారు కదా?  
హీరో నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డికి సినిమా అంటే ప్యాషన్. వారి నిర్మాణంలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. వారు 'విక్రమ్' మూవీని దాదాపు 400పైగా థియేటర్స్లో భారీగా విడుదల చేయడం ఆనందంగా వుంది. వారికి స్పెషల్ థ్యాంక్స్.     

ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు ఏదైనా ఒక ఛాలెంజ్ ఉండేలా చూసుకుంటారు కదా. విక్రమ్లో మీకు ఛాలెంజ్ అనిపించిన అంశం ఏమిటి? 
ఈ రోజుల్లో సినిమా బాగా ఆడటం, సినిమా బాగుండటం రెండూ ఛాలెంజింగ్. మంచి సినిమా తీస్తే ఆడదనే నమ్మకం డిస్ట్రిబ్యూటర్స్కి వుంది. అలా కాదని నిరూపించడానికి కాస్త ధైర్యం కావాలి. అంత ధైర్యం వున్న బాలచందర్, విన్సెంట్ మాస్టర్ లాంటి వాళ్ళు చాలా తక్కువ. 
 
విక్రమ్ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ లాంటి స్టార్లు కూడా ఉన్నారు కదా..  వాళ్ళ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? 
నా సినిమాల్లో అన్ని పాత్రలకు ప్రాధాన్యం వుంటుంది. సినిమాల విషయానికి వస్తే నన్ను నేను ఎప్పుడూ స్టార్ అనుకోను. నేను ఒక ఆర్టిస్ట్ని మాత్రమే. కానీ అభిమానులు ప్రేమతో స్టార్ అని పిలుస్తారు. కానీ లోపల నేనెప్పుడూ ఒక కళాకారుడినే. కళాకారుడికి నాటకం ముఖ్యం. నేను స్వయంగా రాసిన చిత్రాలలో కూడా పవర్ ఫుల్ పాత్రలు రాశాను. నా చిత్రాలతో చాలా మంది నటీనటులు పరిచయమయ్యారు. హీరోలయ్యారు. పోతురాజు  సినిమాలో పశుపతి,  అన్బే శివంలో మాధవన్ పాత్రలు ఎంతో బలమైనవి. 

సూర్య పాత్ర ఎలా ఉండబోతుంది?
సూర్య స్పెషల్ అప్పియరెన్స్లో కనిపిస్తారు. నిజానికి హీరోని బుక్ చేసేటప్పుడు నేరుగా కలసి బోకే ఇచ్చి బుక్ చేస్తారు. నేను కూడా సూర్యకి ఒక బోకే ఇద్దామని అనుకున్నా. విక్రమ్ స్పెషల్ రోల్ గురించి కలసి మాట్లాడదామని ఫోన్ చేశా. కానీ ఫోన్ కాల్లోనే అంతా అయిపొయింది. ''నేను చేస్తా అన్నయ్యా'' అన్నారు. నేను వెళ్ళేటప్పటికి మొత్తం అయిపొయింది. బోకే ఇవ్వడం కుదరలేదు కానీ(నవ్వుతూ). షేక్ హ్యాండ్తో సరిపెట్టుకున్నాం. 

భవిష్యత్తులో సూర్యతో ఫుల్ లెంత్ సినిమా వుంటుందా? 
మా బ్యానర్లో సూర్యతో సినిమా చేయాలనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. చర్చలు నడుస్తున్నాయి. ఈ లోగా ఆయన విక్రమ్ లో స్పెషల్ అప్పియరెన్స్ రోల్ చేశారు. సూర్యతో తప్పకుండా సినిమా చేస్తాం. దాదాపు ఐదుగురు దర్శకులతో మాట్లాడాం. మహేశ్ నారాయణ్ తో మా బ్యానర్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. మలయాళంలో మాలిక్ లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించారాయన. మహేశ్ నారాయణ్ గతంలో విశ్వరూపంకు ఎడిటర్గా కూడా పని చేశారు. కోవిడ్ సమయంలో సినిమాటోగ్రఫీ కూడా నేర్చుకున్నారు. 

తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? 
నాకూ చేయాలనే వుంది. నేరుగా తెలుగులో సినిమా చేసి చాలా కాలమైంది. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మీరు చేసే ప్రతి సినిమా ప్రతి భాషలోకి వెళుతుంది. ఇది ఎప్పటి నుండో వుంది. కానీ ఇప్పుడది పాన్ ఇండియా ట్రెండ్ అయ్యింది. దీన్నెలా చూస్తారు? 
ట్రెండ్ అనేది కొత్త న్యూస్ అంతే. చరిత్ర చూస్తే ఇది ఎప్పటి నుంచో ఉంది. ఏఎన్ఆర్ దేవదాస్ తెలుగు వెర్షన్ చెన్నైలో మూడేళ్ళు ఆడింది. 'మరో చరిత్ర'కి కూడ అంతే. 'సాగర సంగమం' డబ్ చేస్తే అది అక్కడ సిల్వర్ జూబ్లీ విజయాన్ని అందుకుంది. అలాగే స్వాతిముత్యం. పాన్ ఇండియా అనేది బాలచందర్ లాంటి దర్శకులు ఎప్పుడో ప్రూవ్ చేశారు.

మీరు కూడా తెలుగు, తమిళ అని కాకుండా ఇండియన్ సినిమా అనడానికే ఇష్టపడతారు కదా? 
అవునండీ. ప్రస్తుతం హైదరాబాద్ నేషనల్ ఫిలిం మేకింగ్ హబ్గా మారింది. ముందు చెన్నై వుండేది. నాగిరెడ్డిలాంటి దర్శకులు మాయాబజార్ వంటి చిత్రాలని తెలుగు తమిళంలో తీసేవారు. రాముడు భీముడు తెలుగు, ఎంగవిట్టి పిళ్ళై తమిళ్ ,  రామ్ ఆర్  శ్యామ్  హిందీ .. ఈ చిత్రాలన్నీ ఒకే నిర్మాణ సంస్థ తీసింది. చంద్రలేఖ మొదటి పాన్ ఇండియా మూవీ. అలాగే ఇప్పుడు బాహుబలి. పాన్ ఇండియా సినిమా అనేది ఎప్పటి నుంచో వుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు లాంగ్వేజ్ సినిమాలు తీయలేదు కానీ సౌత్ నుండి అన్ని భాషల చిత్రాలు తెరకెక్కాయి. రామానాయడు అన్ని భాషల చిత్రాలు తీశారు. ఆయన నేషనల్ ప్రొడ్యూసర్, పాన్ ఇండియా ప్రొడ్యూసర్. 

ఓటీటీలో కూడా ఇంత మార్పు వస్తుందని మీరు ముందే గ్రహించారు కదా? 
ఓటీటీ మార్పు రావాలని నేనేం పట్టుపట్టలేదు. అది కచ్చితంగా రావాలి. ఇప్పుడు వచ్చింది. ఐతే ఎన్ని మార్పులు వచ్చినా దేని ప్రాధాన్యత దానికి వుంటుంది. చేతికి పెట్టుకునే వాచ్ వచ్చిందని టవర్ క్లాక్కి డిమాండ్ తగ్గలేదు కదా. తిరుపతి క్యాలెండర్ ఇంట్లో ఉన్నంత మాత్రాన అక్కడ భక్తుల రద్దీ తగ్గిపోదు కదా. థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే. థియేటర్ అనేది గుడి కంటే గొప్ప చోటని భావిస్తా. ఎందుకంటే పక్కనున్నవాడు ఏ జాతి, మతం అనే పట్టింపు ఎవరికీ వుండదు. 

ఒకప్పుడు మీ సినిమాని నేరుగా టీవీలో రిలీజ్ చేస్తామంటే గొడవ జరిగింది.. కానీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు కదా? 
కొత్తది ఏది వచ్చినా మొదట భయం వేస్తుంది. పిజ్జాని చూసి కూడా మొదట ఇలానే ఫీలై ఉంటాం కదా.. అయితే కేవలం పిజ్జానే తినాలంటే ఒప్పుకోం.  మనకి ఉలవచారు కూడా ఇష్టం. అన్నీ రుచులు వుంటాయి. అయితే ఫైనల్గా ఒక ఒరిజినల్ రుచి బయటికి వస్తుంది. ప్రేక్షకుడు అంతిమంగా సినిమాని థియేటర్లో చూడటానికే ఇష్టపడతాడు. మనందరికీ కిచెన్ వుంటుంది. కానీ ఒకరోజు ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా హోటల్లో భోజనం చేస్తాం కదా. ఇదీ అంతే.

అనిరుధ్ మ్యూజిక్ గురించి చెప్పండి? 
అనిరుధ్ పెద్ద కళాకారుల కుటుంబం నుండి వచ్చాడు. ఆయన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ సుబ్రహ్మణ్యం అద్భుతమైన కళాకారుడు. చాలా గొప్ప సినిమాలకు పని చేశారు. అనిరుధ్ మంచి మ్యూజిక్ ఇవ్వడంలో నాకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంతగొప్ప  కళాకారుల కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కచ్చితంగా మంచి సంగీతం అందించాలి.

విక్రమ్లో పాట కూడా పాడారు? 
కె.విశ్వనాథ్ నుండి నాకు ఒక అలవాటు వచ్చింది. సినిమా కోసం ఏదైనా చేయమంటే తప్పకుండా చేస్తాను. విక్రమ్లో పాట పాడమని అడిగారు. పాడాను. 

విశ్వనాథ్ను కలుస్తుంటారా? 
చెన్నైలో ఉండేటప్పుడు వారానికి, నెలకి ఒకసారైన కలిసేవాడిని. ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చారు. ఫోన్లో తరుచూ మాట్లాడుతుంటాం. 

నటన, నిర్మాణం, రాజకీయం వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? 
సౌత్లో ఇది కొత్త కాదు. అక్కడ సినిమా, రాజకీయాలది విడదీయరాని కలయిక. నా ముందు తరం నటులు, నిర్మాతలు, పెద్దలు అందరు చేసిందే నేను చేస్తున్నా. 

భారతీయుడు 2 సినిమా దర్శకత్వం మీరే చేస్తున్నారా ? 
నా నుండి ప్రేక్షకులు ఏడాదికి రెండు సినిమాలైనా కోరుకుంటున్నారు. దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటే అది సాధ్యంకాదు. అందుకే దర్శకత్వ బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించి నటనపై దృష్టిపెట్టాలని భావిస్తున్నా. 

భారతీయుడు 2 మూవీ ఈ ఏడాది పూర్తవుతుందా?
పూర్తి చేయడానికే ప్రయత్నిస్తున్నాం.