బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రోజుకో చోట నిరసన సెగ తగులుతోంది. ఇటీవల మంత్రి గంగుల,రెడ్యానాయక్ ను నిలదీసిన గ్రామస్తులు ఇవాళ వికారాబాద్లో పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డిని నిలదీశారు గ్రామస్థులు. పల్లెబాట కార్యక్రమంలో పూడూరు మండలం చెనుగోముల్ గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. రోడ్డు వేయిస్తామని ఇంత వరకు వేయలేదని గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకుని నిలదీశారు. ఇంత వరకు కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని... చాలా మందికి కొత్త పెన్సన్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెబాట కార్యక్రమం అని చెప్పుకుంటూ పోలీసు బందోబస్తుతో గ్రామాల్లో తిరగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసి దర్జాగా రావాలి పర్యటించాలి కానీ పోలీసుల బందోబస్తుతో కాదన్నారు. ఎమ్మెల్యే అండదండలతో మట్టిని మైనింగ్ చేస్తున్నారని మండిపడ్డారు గ్రామస్తులు.ఎమ్మెల్యే ను గ్రామస్తులు ప్రశ్నించడంతో అక్కడి నుంచి జారుకున్నారు.
