V6 News

ఎంత క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే.. ఇలా నడిరోడ్డుపై రౌండప్ చేసి కొడతారా..?

ఎంత క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే.. ఇలా నడిరోడ్డుపై రౌండప్ చేసి కొడతారా..?

ఒకప్పుడు తీసుకున్న డబ్బులు చెప్పిన సమయానికి తిరిగివ్వకపోతే వడ్డీ వ్యాపారులు కిరాయి గూండాలను ఇళ్ల మీదకు పంపించి దమ్కీ ఇప్పించేవాళ్లు. అప్పటికీ ఇవ్వకపోతే ఇళ్లలో సామాన్లు తీసి రోడ్డు మీద పడేసేవాళ్లు. అయినప్పటికీ ఇవ్వకపోతే కిరాయి గూండాలతో దాడులు చేయించి మరీ ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేసుకునేవాళ్లు. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి.

క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ అంటూ అప్పులు చేసే అవకాశాలు చాలా వచ్చాయి. క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించకపోతే ఫైన్లు మీద ఫైన్లతో వాయించేస్తారు. ఈ జరిమానాలకు భయపడి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక దగ్గర అప్పోసొప్పో చేసి క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేవాళ్లు ఎక్కువ మంది ఉంటారు. కానీ.. కొందరు మాత్రం మొండికేసే రకాలు ఉంటారు. అలాంటి వాళ్ల చుట్టూ రికవరీ ఏజెంట్లు కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. కానీ.. పుణెలో మాత్రం అలా జరగలేదు.

క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించలేదని రికవరీ ఏజెంట్లు ఒక వ్యక్తిపై నడి రోడ్డుపై దాడికి దిగారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. అతనితో ఒక యువతి ఉందని కూడా చూడకుండా.. అమానుషంగా పిడికిళ్లతో దాడి చేస్తూ.. కాళ్లతో తన్నుతూ దృశ్యాలు కనిపించడంతో నెటిజన్లు మండిపడ్డారు. అప్పు వసూలు చేసే పద్ధతి ఇది కాదని.. సదరు రికవరీ ఏజెంట్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ ఘటన పుణెలోని హడప్సర్ రోడ్ నెంబర్.15లో జరిగింది. మన దేశంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకపోతే కొందరు రికవరీ ఏజెంట్లు ఇలా భౌతిక దాడులకు దిగుతున్నారని ఈ ఘటన వెలుగులోకి తెచ్చింది.

రుణ వసూళ్ల కోసం నియమించిన బయటి రికవరీ ఏజెంట్ల వేధింపులపై వస్తున్న ఫిర్యాదులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తీసుకున్న బాకీని తిరిగి చెల్లింకపోతే న్యాయపరంగా ముందుకెళ్లాలని.. భౌతిక దాడులు నిషేధం అనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా పాటించాలి. కానీ.. ఈ నిబంధనలను కొన్ని బ్యాంకులు అస్సలు పట్టించుకోవడం లేదు. బయట వ్యక్తులను రికవరీ ఏజెంట్లుగా నియమించుకుని ఆటవిక రాజ్యం తరహాలో భౌతిక దాడులు చేయించైనా డబ్బులను వసూళ్లు చేసుకుంటుండటం గమనార్హం.