Virat Kohli: బ్యాటర్‌గా అదుర్స్.. కెప్టెన్‌గా టాప్: కోహ్లీ టెస్ట్ కెరీర్ రికార్డ్స్, హైలెట్స్ ఇవే!

Virat Kohli: బ్యాటర్‌గా అదుర్స్.. కెప్టెన్‌గా టాప్: కోహ్లీ టెస్ట్ కెరీర్ రికార్డ్స్, హైలెట్స్ ఇవే!

టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ సోమవారం (మే 12) రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో మొదలైన కోహ్లీ ప్రయాణం 2025లో ముగిసింది. ఇకపై కింగ్ టెస్టుల్లో కనిపించడనే ఊహ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 14 ఏళ్ళ టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ కేవలం బ్యాటర్ గానే కాదు కెప్టెన్ గా తన మార్క్ చూపించాడు. చివరి నాలుగు సంవత్సరాలు పక్కనపెడితే కోహ్లీ టెస్ట్ ప్రయాణం అద్భుతంగా సాగింది. ప్రారంభంలో అందరిలాగే తడబడినా ఆ తర్వాత పుంజుకొని టెస్ట్ ఫార్మాట్ లో తన సత్తా చూపించాడు. కోహ్లీ టెస్ట్ కెరీర్ లో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

2011లో టెస్ట్ అరంగేట్రం:

రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో మిడిల్ ఆర్డర్ లో కోహ్లీకి తొలిసారి అవకాశం దక్కింది. జూన్ 2011లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై కోహ్లీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటివరకు వన్డేల్లో అద్భుతంగా రాణించిన కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం ప్రారంభంలో కాస్త తడబడ్డాడు. ఆస్ట్రేలియా టూర్ లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో టెస్టుల్లో కోహ్లీ ఆడలేడనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ సిరీస్ లో జరిగిన చివరి టెస్టులో కోహ్లీ సెంచరీ చేసి సత్తా చాటాడు. 2013 లో సౌతాఫ్రికాలో సెంచరీ.. 2014లో న్యూజిలాండ్ లో సెంచరీ చేసి విదేశాల్లో తాను అడగలనని నిరూపించాడు. 

2014-2018 కోహ్లీ టెస్ట్ కెరీర్ లో అత్యున్నత దశ:

2014 లో ధోనీ నుంచి టెస్ట్ కెప్టెన్సీ చేపట్టిన కోహ్లీ బ్యాటింగ్ లో చెలరేగి ఆడాడు. 2014-15 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా టూర్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఏకంగా దాదాపు 700 పరుగులు చేసి సంచలనంగా మారాడు. ఈ సిరీస్ లో నాలుగు సెంచరీలు బాదడం విశేషం. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేసి కంగారులనే ఆశ్చర్య పరిచాడు. 

2015, 206 లో స్వదేశంలో కోహ్లీ పరుగుల వరద పారించాడు. సెంచరీలు డబుల్ సెంచరీలుగా మలిచాడు. వెస్టిండీస్ పై కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న విరాట్.. ఆ తర్వాత రెండేళ్లలో 7 డబుల్ సెంచరీలు చేసి ఔరా అనిపించాడు. 2018 లో ఇండియా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్ళినప్పుడు కోహ్లీ తన విశ్వ రూపాన్ని చూపించాడు. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో 593 పరుగులు చేసి ఈ సిరీస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 2016- 2019 మధ్య కోహ్లీ కెరీర్ పీక్స్ లో ఉంది. ఈ మూడేళ్ళలో 43 మ్యాచ్‌ల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు సాధించాడు. 69 ఇన్నింగ్స్‌ల్లోనే  16 సెంచరీలు.. 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

భారత బెస్ట్ టెస్ట్ కెప్టెన్:

టీమిండియా బెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 68 టెస్టుల్లో టీమిండియాకు 40 మ్యాచ్ ల్లో విజయాన్ని అందించాడు. విరాట్ విజయాలు శాతం దాదాపు 60 ఉండడం విశేషం. 2019లో ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి భారత క్రికెట్ జట్టుకు సిరీస్ విజయాన్ని అందించాడు. సౌతాఫ్రికా గడ్డపై విజయం.. ఇంగ్లాండ్ లో విజయాలు విరాట్ కోహ్లీ ద్వారానే వచ్చాయి. అంతేకాదు 2021లో న్యూజిలాండ్ పై భారత్ ను టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోహ్లీ నాయకత్వంలోనే ఆడింది.  

2020 నుంచి క్షీణించిన కోహ్లీ దశ:

టెస్ట్ కెరీర్ లో విరాట్ కోహ్లీ గత నాలుగేళ్లుగా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. ముఖ్యంగా స్వదేశంలో స్పిన్ ధాటికి కుదేలవుతున్నాడు. ఇక విదేశాల్లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వద్ద పడిన బంతులకు ప్రతిసారి దొరికిపోతున్నాడు. చివరి నాలుగేళ్లలో కోహ్లీ 39 టెస్టుల్లో 30.72 సగటుతో 2,028 పరుగులు మాత్రమే చేశాడు. 69 ఇన్నింగ్స్‌లలో కేవలం మూడు సెంచరీలు.. తొమ్మిది అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయి.పేలవ ఫామ్ తో తన టెస్ట్ యావరేజ్ 54 నుంచి 47 కి పడిపోయింది. 2023లో కోహ్లీ ఫామ్ స్వల్పంగా పుంజుకుంది. ఈ ఏడాది ఎనిమిది టెస్టుల్లో 55.91 సగటుతో 671 పరుగులు చేశాడు. 12 ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు.. రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

ఓవరాల్ గా విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ ను ఒక్కసారి చూసుకుంటే.. 123 టెస్ట్ మ్యాచుల్లో 210 ఇన్నింగ్స్ ఆడాడు. 9230 పరుగులు చేశాడు. 31 హాఫ్ సెంచరీలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలతో కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని అనుభూతులను మిగిల్చింది.