కరోనా వైరస్ నేచురల్​గా పుట్టలే.. నితిన్ గడ్కరీ సంచలన కామెంట్

కరోనా వైరస్ నేచురల్​గా పుట్టలే.. నితిన్ గడ్కరీ సంచలన కామెంట్

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నేచురల్​గా పుట్టింది కాదని, దానిని ల్యాబ్ లోనే తయారు చేశారని అన్నారు. బుధవారం నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్ చేశారు. ‘‘కరోనాతో కలిసి బతకడం మనం అలవాటు చేసుకోవాలి. ఇది సహజంగా పుట్టిన వైరస్ కాదు. దానిని ప్రయోగశాలలో తయారు చేశారు. అందుకే ఈ పరిస్థితిని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు -టీకా కోసం పరిశోధనలు చేస్తున్నాయి. వీలైనంత త్వరగా వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు”అని గడ్కరీ అన్నారు.

కరోనా ఎఫెక్టుతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్స్ పై మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇలాంటి కష్ట సమయంలో ఆర్థిక పరిస్థితి అనుకూలతలు క్రియేట్ చేయడం సవాలుతో కూడుకున్నదని అన్నారు. లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా సొంతూళ్లకు వెళ్లిపోయిన కార్మికులు, కూలీలు వ్యాపారాలు ప్రారంభమైనప్పుడు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనాతో పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సిన అవసరముందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెలా లాక్​డౌన్ ను పెంచలేమని ఆయన అన్నారు.