టైటానిక్ హీరోకు అస్సాం సీఎం ఆహ్వానం

టైటానిక్ హీరోకు అస్సాం సీఎం ఆహ్వానం

హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోకు అస్సాం నుంచి ఆహ్వానం అందింది.  డికాప్రియోను అస్సాంలోని కజిరంగా నేషనల్‌ పార్క్‌ను సందర్శించాలని సీఎం హిమంత బిశ్వ శర్మ ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంబంధిత అంశాలపై డికాప్రియో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆయన అంతరించే దశలో ఉన్న ఒంటికొమ్ము ఖడ్గమృగాల గురించి ప్రస్తావించారు. వాటి పరిరక్షణ కోసం అస్సాం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ‘‘2000 నుంచి 2021 మధ్యకాలంలో 190 ఖడ్గమృగాలను చంపేశారు. కొమ్ముల కోసం వీటిని హత్య చేశారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో వాటిని వేటాడకుండా చూసేందుకు 2021లో అస్సాం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2022లో ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరింది. 1977 తర్వాత ఆ ప్రాంతంలో మొదటిసారి ఒక్క ఖడ్గమృగాన్ని కూడా వేటాడలేదు’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

డికాప్రియో పోస్ట్‌పై అస్సాం సీఎం స్పందించారు. ‘‘వన్యప్రాణులను రక్షించుకోవడం అంటే మన సంస్కృతిని రక్షించుకున్నట్లేనని అన్నారు. వాటి సంరక్షణకు తామంతా అంకితభావంతో పనిచేస్తున్నామని చెప్పారు. ‘‘ డికాప్రియో.. మీకు మా కృతజ్ఞతలు. ఓ సారి కజిరంగ పార్క్‌ను మీరు సందర్శించాలని ఆహ్వానిస్తున్నాం  అని ట్వీట్ చేశారు.