V6 News

సందర్శనకు నేడే ఆఖరు

సందర్శనకు నేడే ఆఖరు
  •     శనివారం ఒక్కరోజే 4,100 మంది టూరిస్టులు 
  •     15 రోజుల్లో 26 వేల మంది విజిటర్స్  

కంటోన్మెంట్, వెలుగు: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి సందర్శకులు పోటెత్తారు. వీకెండ్, సంక్రాంతి సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. శనివారం ఒక్కరోజే 4,100 మంది సందర్శించినట్లు అధికారులు తెలిపారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లని వారు పిల్లలతో కలిసి రాష్ట్రపతి నిలయాన్ని సందర్శిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో రెండేండ్ల తర్వాత ఈ ఏడాది సాధారణ జనాలకు సందర్శించేందుకు అనుమతి ఇచ్చారు. జనవరి 1 నుంచి సందర్శనకు అనుమతించగా, ఇప్పటివరకు 26 వేల మంది విజిటర్స్ వచ్చినట్లు తెలిపారు. 

రాష్ట్రపతి నిలయం సందర్శణ ఆదివారంతో ముగియనుంది. ఇక్కడ వాటర్ ఫౌంటెన్స్, రాక్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. పండ్లు, పూల మొక్కలు, 116 రకాల ఔషధ మొక్కలు ఆకర్షణీయమైన రంగుల్లో దర్శనమిస్తున్నాయి. సుగంధ ద్రవ్యాల మొక్కలు, పండ్ల మొక్కలు, మంచి నీటి బావులతో ఈ ప్రాంతం గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తుంది. 27 నక్షత్రాలను ప్రతిబింబించేలా 27 రకాల మొక్కలతో ఏర్పాటు చేసిన నక్షత్రశాల సదర్శకులను ఆకట్టుకుంటున్నది.

ఇక్కడకు రావడం ఓ తీపి జ్ఞాపకం..

నేను దోమలగూడలో ఉంటాను. మొదటిసారి రాష్ట్రపతి నిలయాన్ని చూడటానికి వచ్చాను. చాలా బాగుంది. చల్లటి వాతావరణం, పచ్చని చెట్లు బాగా నచ్చాయి. టైమ్ దొరికితే ఇంకోసారి చూడాలని ఉంది. వచ్చే ఏడాది వద్దామనుకుంటున్నాం. ఇది మాకు తీపి జ్ఞాపకం. - శైల, దోమలగూడ

ఫస్ట్ టైమ్‌ ఇక్కడికి వచ్చా...

రాష్ట్రపతి నిలయాన్ని చూడాలని ఎన్నోసార్లు అనుకున్నాం. రెండేండ్లుగా కరోనా కారణంగా ప్రజలను అనుమతించ లేదు. ఈ ఏడాది అనుమతి ఇస్తున్నారని తెలిసి ఫస్ట్‌ టైమ్‌ ఫ్యామిలీతో వచ్చాను. ఇక్కడ మంచి ఆహ్లాదకర వాతావరణం, మనసుకు ప్రశాంతత ఇచ్చే ప్రకృతి సిద్ధమైన వనాలు ఎంతో బాగున్నాయి.  - రాజారావు, రిటైర్డ్ ఎంప్లాయ్​, మల్కాజిగిరి