ఒంట్లో విటమిన్లు ఉంటలేవ్

ఒంట్లో విటమిన్లు ఉంటలేవ్

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో పిల్లలు, మహిళలు విటమిన్ల లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఏ, బీ, సీ, డీ.. ఇలా అన్ని విటమిన్ల డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. దాదాపు10% పిల్లల్లో ఒకటి కంటే ఎక్కువ విటమిన్ల లోపం ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు. మహిళల్లో 30 నుంచి 40% మంది మల్టిపుల్ విటమిన్ డెఫీషియన్సీతో బాధపడుతున్నారు. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌) ఈ మధ్య చేసిన సర్వేలోనూ ఈ విషయం వెల్లడైంది. 40 నుంచి 50% మహిళల్లో రకరకాల విటమిన్ లోపాలున్నట్టు ఈ సర్వేలో తేలింది. మహిళల్లో ఎక్కువగా డీ, బీ విటమిన్ లోపం ఉంటుండగా, పిల్లల్లో ఏ, సీ, డీ విటమిన్ లోపం ఉంటోంది. చాలా మందికి తమకు విటమిన్ లోపం ఉందన్న విషయం తెల్వడం లేదు. విటమిన్ లోపం మెల్లగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీంతో తమకు లోపం ఉందన్న సంగతి తీవ్రమయ్యే దాకా తెలుసుకోలేకపోతున్నారు. విటమిన్ డెఫిషియన్సీ సుదీర్ఘకాలం కొనసాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని మెడికల్ ఎక్స్​పర్టులు హెచ్చరిస్తున్నారు. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, పోషకాహారం తీసుకోకపోవడం వల్లే విటమిన్ల లోపం ఉంటోందని చెబుతున్నారు.

విటమిన్ లేదం‘డీ’

చాలా మంది గృహిణులు, ఉద్యోగాలు చేసే మహిళలు డీ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. గృహిణులు ఎండకు వెళ్లకపోవడం, ఉద్యోగం చేసే మహిళలు ఇంటి ముందే క్యాబ్ ఎక్కడం, ఇంటి ముందే దిగుతుండటంతో సూర్యరశ్మి సోకే అవకాశమే ఉండటం లేదు. స్కూటీలపై వెళ్లిన వాళ్లూ చేతులను గ్లౌజులతో, ఫేస్‌ను స్కార్ఫ్‌లతో కప్పేసుకుంటున్నారు. దీంతో వారిలో అవసరమైన మేర డీ విటమిన్ ఉత్పత్తి అవడం లేదు. దాదాపు 60 నుంచి 70% మంది మహిళలు డీ డెఫీషియన్సీతో బాధపడుతున్నారు. మహిళలు, పిల్లల్లో కామన్‌గా కనిపించే సమస్య డీ విటమిన్ డెఫీషియన్సీ. ఈ విటమిన్ లోపంతో ఎముకల బలహీనతతోపాటు, ఊబకాయం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదముంటుంది. డీ విటమిన్ లోపం డయబెటీస్‌, డిమెన్షియాకు దారి తీస్తున్నట్టు విదేశాల్లో జరిగిన కొన్ని పరిశోధనల్లో తేలింది.

కాసేపు ఎండలో నిల్చుంటే చాలు

మిల్లీలీటర్ రక్తంలో 75 నానోగ్రాముల విటమిన్ డీ ఉంటే అది సరైన పాళ్లలో ఉన్నట్లు లెక్క. అదే 50–-75 నానోగ్రాములు ఉంటే తగినంత లేనట్టు. అంతకంటే తక్కువుంటే లోపంగా పరిగణిస్తారు. రోజు కొంత సమయం ఎండలో ఉంటే, డీ డెఫిషియన్సీని గెలవొచ్చు. అయితే ఎంతసేపు ఎండలో ఉండాలన్నది కాలం, వ్యక్తుల చర్మం తీరుపై ఆధారపడి ఉటుందని డాక్టర్లు చెబుతున్నారు.

బీ లేకుంటే బెడదే

బియ్యం పైపొరలో బీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కానీ బియ్యం పైపొరను పూర్తిగా పాలిష్ చేస్తుండటంతో అందులో ఉండే విటమిన్లు పోతున్నయ్. దీంతో రోజూ అన్నం తినే వాళ్లలోనూ బీ విటమిన్ లోపం ఉంటోంది. బీ2, బీ6, బీ9, బీ12 లోపం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్‌ఐఎన్ సర్వేలో 50% మందిలో బీ2, 46% మందిలో బీ6, ఇంకో 46% మందిలో బీ12, 32% మందిలో బీ9 విటమిన్ డెఫీషియన్సీ ఉన్నట్టు తేలింది. శరీర పెరుగుదల, కణజాలాల నిర్మాణం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి వంటి అనేక అంశాల్లో బీ విటమిన్లు తోడ్పాటు అందిస్తాయి. ఈ విటమిన్ల లోపంతో నాడీ సంబంధ వ్యాధులు, రక్తహీనత, గుండె జబ్బులు, నోటి మూలల్లో చీలిక, నాలుకపై పూత, చర్మం పాలిపోవడం, అతిసారం వంటి సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఫిట్స్‌, మైగ్రేన్‌, డిప్రెషన్‌వచ్చే ప్రమాదముంటుంది. పిల్లల్లో బీ6 లోపం ఉంటే మెదడు ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.

ఇవి తినాలె

మహిళల్లో డీ విటమిన్ తర్వాత, ఎక్కువగా బీ విటమిన్ లోపం కనిపిస్తోందని డాక్టర్ మయూరి తెలిపారు. ‘మన రాష్ర్టంలో ఐరన్‌లోపంతో చాలా మంది రక్త హీనతను ఎదుర్కొంటున్నారు. రక్తహీనతకు బీ విటమిన్‌లోపం కూడా ఓ కారణమే.’ అని ఆమె వివరించారు. బీ విటమిన్లు దంపుడు బియ్యం, మాంసం, గుడ్డు, ఆకు కూరలు, బీన్స్‌లో ఎక్కువగా లభిస్తాయి.

ఏ, సీ.. డెఫిషియన్సీ

ఇప్పుడు పిల్లలంతా స్కూల్ లేదా ‘స్ర్కీన్‌’కే ఎక్కువగా పరిమితమవుతున్నారు. ఓ గంటసేపు కూడా ఆటలు ఆడటం లేదు. విటమిన్ల లోపానికి ఇది కూడా పరోక్ష కారణమవుతోందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో ప్రతి వంద మందిలో 60 మంది పిల్లలు విటమిన్‌ఏ లోపంతో బాధపడుతున్నారు. దీంతో వారిలో కంటి చూపు సమస్యలు పెరుగుతున్నాయి. స్కూల్ ఏజ్ పిల్లల్లో 30% మంది సైట్‌తో ఇబ్బంది పడుతున్నారు. సీ విటమిన్ లోపంతో స్కర్వీ వస్తుంది. చిగుళ్లు మెత్తబడడం, రక్తం కారడం సీ విటమిన్ లోపానికి ఇండికేషన్స్‌.