సీబీఐ దర్యాప్తుతో వాస్తవాలు బయటకొస్తయ్​ : వివేక్ వెంకటస్వామి

సీబీఐ దర్యాప్తుతో వాస్తవాలు బయటకొస్తయ్​ : వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి సంబంధం లేదని మొదటి నుంచి చెప్తున్నామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీని బద్నాం చేసేందుకు కేసీఆర్​ కుట్రలు పన్నారని మండిపడ్డారు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ ఎస్, కాంగ్రెస్  నేతలు, కార్యకర్తలు సుమారు 130 మంది సోమవారం సోమాజిగూడలో వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి వివేక్ వెంకటస్వామి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ నేత గొట్టిముక్కల సురేశ్​ రెడ్డి, శ్రీధర్  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ .. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్​పై సీఎం కేసీఆర్​ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సీబీఐ దర్యాప్తుతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ రాక్షస పాలన భరించలేక మోడీ సుపరిపాలన చూసి ప్రజలందరూ బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమాన్ని వదిలిపెట్టి కేసీఆర్  కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటున్నదని ఆయన ఆరోపించారు.

హైకోర్టు తీర్పు సర్కారుకు చెంపపెట్టు: కిషన్​రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన నకిలీ కేసులో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. సిట్​ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్​ సర్కారుకు చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్​ అబద్ధాలను హైకోర్టు ఎండగట్టిందన్నారు. కేసీఆర్​ కుటుంబ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉండడంతో ఆయనే ఈ ఎపిసోడ్​ను సృష్టించారని తాము అన్న మాటలే నిజమని హైకోర్టు తీర్పు రుజువు చేసిందన్నారు. నీతి నిజాయితీకి కట్టుబడిన జాతీయ నాయకులను ఈ వ్యవహారంలోకి లాగి కేసీఆర్​ తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని ఆయన ఫైరయ్యారు. ఐపీఎస్​ అధికారులు కేసులో నిజాలను వెల్లడించకపోవడం దురదృష్టకరమని కిషన్​రెడ్డి పేర్కొన్నారు.