
నల్గొండ టౌన్, వెలుగు: మహాత్మా గాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. నల్గొండ పట్టణం పానగల్‌లోని పచ్చల సోమేశ్వర ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన మహాత్మాగాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ నెల్సన్ మండేలా సైతం గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని ఆచరించారని అన్నారు. ప్రధాని మోడీ సైతం గాంధీ ఆలోచనా విధానంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.
గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 150 కి.మీ. మేర పాదయాత్ర చేయాలని నిర్ణయించిందని, గాంధీజీ ఆలోచన విధానాలను ఈ పాదయాత్రతో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు మహాత్మాగాంధీ చూపిన బాటలో ప్రయాణిస్తూ అహింసా పద్ధతులను పాటించాలని కోరారు. పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సంకల్ప యాత్ర చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, యాత్ర రాష్ట్ర ఇన్చార్జ్ దుగ్యాల ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.