అంబేద్కర్ ఆశయాల కోసం పని చేసినోళ్లు చరిత్రలో నిలిచిపోతరు

అంబేద్కర్ ఆశయాల కోసం పని చేసినోళ్లు చరిత్రలో నిలిచిపోతరు

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి 

ఖైరతాబాద్, వెలుగు : అంబేద్కర్ ఆశయాల కోసం పని చేసినోళ్లు చరిత్రలో నిలిచిపోతారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్​లో మాల మహానాడు నాయకులు వెల్తురు మల్లయ్య, మలిపెద్ది చంద్రశేఖర్​ల సంస్మరణ సభ జరిగింది. దీనికి వివేక్ హాజరై మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా మాలల ఐక్యత కోసం మల్లయ్య, చంద్రశేఖర్ కృషి చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని చెప్పారు. పీవీ రావు నాయకత్వంలో మల్లయ్య ఉమ్మడి ఏపీలో మాలల అభివృద్ధి కోసం పోరాటం చేశారని తెలిపారు.

అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఈ సందర్భంగా మల్లయ్య, చంద్రశేఖర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాళ్లిద్దరూ లేకపోయినా, వాళ్లు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు తలమళ్ల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.