ఐటీ లేఆఫ్స్ దెబ్బ.. ఇంటి EMI రూ.95వేలు కట్టేందుకు ర్యాపిడో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

ఐటీ లేఆఫ్స్ దెబ్బ.. ఇంటి EMI రూ.95వేలు కట్టేందుకు ర్యాపిడో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

ఓడలు బండ్లు అవ్వటం అంటే ఇదేనేమో. ఒకప్పుడు ఏటా రూ.40 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ వెలుగు వెలిగిన ఆ టెక్కీ జీవితం.. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ మధ్య కిలోమీటర్ల లెక్కలు చూసుకునే స్థాయికి పడిపోయింది. 2024లో ఎంతో గర్వంగా.. ఆత్మవిశ్వాసంతో ఎన్‌సీఆర్ ఏరియాలో ప్రతిష్టాత్మక 'ప్రతీక్ గ్రాండ్ సిటీ'లో కోటి 40 లక్షల రూపాయలు ఖరీదైన 3BHK ఫ్లాట్‌ను కొన్న టెక్కీ తన కెరీర్‌కు డోకా లేదని భావించాడు. నెలకు రూ.95వేలు EMI కట్టడం తన జీతానికి పెద్ద లెక్క కాదనుకున్నాడు అప్పట్లో. అయితే ఊహించని విధంగా కంపెనీ లేఆఫ్ ప్రకటించడంతో మూడు నెలల్లోనే ఆ విలాసవంతమైన ఇల్లు మోయలేని భారంగా మారిపోయింది.

మధ్యతరగతి కలల సౌధం కూలిపోవడానికి ఒక్క వేటు చాలని ఈ టెక్కీ స్టోరీ నిరూపిస్తోంది. హై-ప్రొఫైల్ ఉద్యోగం పోయాక.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బ్యాంక్ ఈఎంఐలు మాత్రం ఆగవు. తన కలల ఇల్లు వేలం పడకూడదనే మొండి పట్టుదలతో.. ఆ టెక్కీ ఇప్పుడు టై కట్టుకుని ల్యాప్‌టాప్ ముందు కూర్చోవాల్సిన చేతులతో బైక్ హ్యాండిల్ పట్టుకున్నాడు. ర్యాపిడో రైడర్‌గా మారి సిటీ రోడ్లపై తిరుగుతూ.. ప్రతి ట్రిప్పు నుంచి వచ్చే చిల్లర పైసలను పోగుచేసి లక్షకు దగ్గరలో ఉన్న ఈఎంఐని నెట్టుకొస్తున్నాడు. కార్పొరేట్ ఆఫీసులో ఏసీ గదుల్లో గడిపిన కాలం పోయి.. ఇప్పుడు ఎండలో, వానలో బైక్ టాక్సీ నడపడం మానసిక సంఘర్షణకు దారితీస్తోంది.

ఇటీవలే ఒరాకిల్ భారత్‌లో సుమారు 12వేల మందిని తొలగించడం ఐటీ రంగంలో పెను ప్రకంపనలు సృష్టించింది. సగటున 15 రోజుల జీతాన్ని సెవరెన్స్ ప్యాకేజీగా ఇస్తున్నా.. లక్షల్లో అప్పులు ఉన్నవారికి అది ఏ మూలకు సరిపోదు. ఈ టెక్కీ పరిస్థితిని చూసిన అతని మిత్రుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఒకప్పుడు సక్సెస్ కి సింబల్ గా కనిపించిన ఆ ఇల్లు ఇప్పుడు అతనికి నిద్రలేని రాత్రులను మిగులుస్తోందని చెప్పాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇచ్చే భద్రత ఎంత తాత్కాలికమో, ఒక చిన్న కుదుపు జీవిత కాలపు సేవింగ్స్ ని ఎలా మాయం చేస్తుందో ఈ స్టోరీ కళ్లకు కడుతోంది.

ఒకవైపు ఆకలి.. మరోవైపు సమాజంలో పరువు, ఇంకోవైపు అప్పుల వాళ్ల ఒత్తిడి. ఈ మూడింటి మధ్య నలిగిపోతున్న ఆ టెక్కీ రియల్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. హై శాలరీ ఉన్నప్పుడు కొండంత అప్పు చేయడం ఎంత ప్రమాదకరమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కంపెనీలు ఇచ్చే పింక్ స్లిప్పులు కేవలం ఉద్యోగాన్ని మాత్రమే కాదు.. ఒక మనిషి ఏళ్ల తరబడి కన్న కలలను, ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తుంది. ల్యాప్‌టాప్ బ్యాగ్ స్థానంలో హెల్మెట్ పెట్టుకుని రోడ్డెక్కిన ఈ టెక్కీ పోరాటం.. గ్లోబల్ ఐటీ సంక్షోభంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న పరిస్థితులకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు.