ప్రాణాలు పోయినా భూములు వదలం..ముత్తారం మండలంలో ట్రెంచ్ పనులను అడ్డుకున్న రైతులు

ప్రాణాలు పోయినా భూములు వదలం..ముత్తారం మండలంలో ట్రెంచ్ పనులను అడ్డుకున్న రైతులు
  • పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని డిమాండ్

ముత్తారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దర్యాపూర్‌‌‌‌లో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వకుండా భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రావడంతో రైతులు జేసీబీలను అడ్డుకుని నిరసన తెలిపారు. 

గ్రామ శివారులోని సర్వే నంబర్లు 140, 141, 144, 145, 149 పరిధిలోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు గురువారం జేసీబీలతో ట్రెంచ్ పనులు ప్రారంభించారు. సమాచారం అందుకున్న రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. 

దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆర్డీవో సురేశ్, గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్​ సమక్షంలో జరిగిన గ్రామసభలో రైతులకు న్యాయం చేసిన తర్వాతే భూసేకరణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

 రామగిరి మండలం రత్నాపూర్ తరహాలో ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని తాము అప్పుడే స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆ హామీలను పక్కనబెట్టి పరిహారంపై ఎలాంటి ప్రకటన చేయకుండా అధికారులు జేసీబీలతో రావడం సరికాదన్నారు. జేసీబీలకు అడ్డంగా పడుకుని రైతులు నిరసన తెలిపారు. 

ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములను ఇవ్వబోం అంటూ హెచ్చరించారు. రైతుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రెవెన్యూ అధికారులు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. న్యాయమైన పరిహారం అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.