ఒకవైపు కోట్ల రూపాయల ప్యాకేజీలతో కొత్త బాస్‌ల ఎంట్రీ.. మరోవైపు ఉన్నపళంగా ఉద్యోగాలు పోయి ఇంటిదారి పడుతున్న టెక్కీలు. ఈ సీన్ ఎక్కడో కాదు అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ కంపెనీలోనే. ప్రస్తుతం అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కొలువుల పరిస్థితి కొంత అటూ ఇటుగా ఇలాగే ఉంది. తాజాగా ఒరాకిల్ సంస్థలో జరిగిన భారీ లేఆఫ్స్ ఒక ఎన్నారై జంట అమెరికా కలను కూల్చేశాయి.
అలా ముగిసిన అమెరికా కల..
పాపం.. ఆ భార్యాభర్తలు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లారు. గత ఏడాది అక్టోబర్‌లోనే భార్య ఉద్యోగం పోయింది. ఎలాగోలా సర్దుకుందాం అనుకునేలోపే.. ఇప్పుడు ఒరాకిల్‌లో జరిగిన 30వేల మంది లేఆఫ్స్‌లో భర్త జాబ్ కూడా ఊడింది. వీరికి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా అవ్వలేదు. చేతిలో ఉన్న గడువు జస్ట్ 60 రోజులు మాత్రమే. దీంతో చేసేదేమీ లేక.. సామాన్లు సర్దుకుని జూలైలో ఇండియాకు తిరిగొచ్చేయాలని ఆ జంట నిర్ణయించుకుంది. వారు తమ బాధను సోషల్ మీడియాలో పంచుకుంటే అది కాస్తా ప్రస్తుతం వైరల్ అయ్యింది.
ఇక్కడ కోట్లు.. అక్కడ కన్నీళ్లు
ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. కంపెనీ వేల మందిని రోడ్డున పడేసిన కొన్ని రోజులకే.. హిల్లరీ మాక్సన్ అనే మహిళను కొత్త సీఎఫ్ఓగా ఒరాకిల్ నియమించటమే. ఆమెకు ఆ కంపెనీ ఇచ్చిన ప్యాకేజీ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.247 కోట్లు (29.7 మిలియన్ డాలర్లు). ఇందులో జీతం, బోనస్, షేర్లు అన్నీ కలిపి ఆకాశమంత ప్యాకేజీ అన్నమాట. సామాన్యుల ఉద్యోగాలు పీకేసి.. పెద్ద తలకాయలకు ఇలా కోట్లు కుమ్మరించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Also Raed : ఇంటి EMI రూ.95వేలు కట్టేందుకు ర్యాపిడో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
అమెరికాలో జాబ్స్ పోగొట్టుకున్న ఆ దంపతుల పోస్ట్‌కు భారతీయుల నుంచి మంచి సపోర్ట్ వస్తోంది. టెన్షన్ పడకండి.. సొంత గడ్డ మీకు ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది అంటూ నెటిజన్లు ధైర్యం చెబుతున్నారు. అమెరికా కంటే మన దేశంలోనే ఇప్పుడు ఐటీ పరిస్థితి మెరుగ్గా ఉందని.. ఇండియా నంబర్‌తో రెజ్యూమే అప్డేట్ చేయమని సలహాలు ఇస్తున్నారు కొందరు సోషల్ మీడియా యూజర్లు.
డాలర్ల వేటలో గెలుపోటములు సహజం. ఈ జంటకు అమెరికాలో అవకాశాల తలుపులు మూసుకుపోయినా.. ఇండియాలో సరికొత్త అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జీవితం ఇప్పుడు హెచ్-1బి వీసాల చుట్టూ కాకుండా.. స్కిల్స్ చుట్టూ తిరుగుతోందని ఈ ఘటన నిరూపిస్తోంది. అమెరికా వదిలి వస్తున్నా.. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదలొద్దు అంటూ ఆ జంటకు నెటిజన్లు ధైర్యం చెబుతున్నారు.
