ఆత్మహత్యల నివారణకు మెట్రో స్టేషన్లలో వాయిస్ మెసేజ్

ఆత్మహత్యల నివారణకు మెట్రో స్టేషన్లలో వాయిస్ మెసేజ్
  • కోల్ కతా మెట్రో వినూత్న ప్రయోగం

కోల్‌‌కతా: మెట్రో రైల్వే స్టేషన్లలో పెరుగుతున్న ఆత్మహత్య ప్రయత్నాలను అరికట్టేందుకు కోల్‌‌కతా మెట్రో యంత్రాంగం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల్లో మనోధైర్యాన్ని నింపేలా స్టేషన్లలో ప్రత్యేక ఆడియో సందేశాలను ఆదివారం ప్రారంభించింది. గత మూడు నెలల్లో సుమారు 10 ఆత్మహత్య ప్రయత్నాలు జరగడం, వాటిలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఒక ఎఫ్‌‌ఎమ్ ఛానెల్‌‌ సహకారంతో రూపొందించిన ఈ సందేశం, స్టేషన్లలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా తరచూ వినిపిస్తారు. 

"జీవితం ఎంతో అందమైనది, క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు" అంటూ బెంగాలీ భాషలో సాగే ఈ విజ్ఞప్తి వెనుక ప్రశాంతమైన నేపథ్య సంగీతాన్ని కూడా జోడించారు. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు తక్షణమే 24/7 అందుబాటులో ఉండే కౌన్సెలర్లను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. ఇందుకోసం స్టేషన్లలో హెల్ప్‌‌లైన్ నంబర్లతో కూడిన పోస్టర్లు, డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు.