ఇండియాలోకి బూడిద మేఘాలు..పలు విమాన సర్వీసులు రద్దు

ఇండియాలోకి బూడిద మేఘాలు..పలు విమాన సర్వీసులు రద్దు
  • యెమెన్, ఒమన్  మీదుగాఉత్తర భారతంలోకి ప్రవేశం
  • పలు విమాన సర్వీసులు రద్దు.. చైనా వైపు వెళ్లిన మేఘాలు
  • యెమెన్, ఒమన్  మీదుగా
  • ఉత్తర భారతంలోకి ప్రవేశం
  • దేశవ్యాప్తంగా పలు 
  • విమాన సర్వీసులు రద్దు
  • ఢిల్లీపై పెద్దగా ప్రభావం 
  • ఉండదన్న సైంటిస్టులు
  • మంగళవారం రాత్రి దేశం దాటి చైనా వైపు మేఘాలు

న్యూఢిల్లీ: ఇథియోపియాలోని అఫర్  ప్రాంతంలో బద్దలైన హేలీ గుబ్బీ అగ్నిపర్వతం తాలూకు బూడిద మేఘాలు భారత్​లోకి ప్రవేశించాయి. కొన్ని వేల అడుగుల ఎత్తులో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ముందుగా గుజరాత్​లోకి ఎంటర్  అయ్యాయి. క్రమంగా రాజస్తాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఉపరితలానికి మేఘాలు విస్తరించాయి. 

ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఫ్లైట్  సర్వీసులను రద్దు చేయాలని పలు విమానయాన సంస్థలకు డైరెక్టరేట్  జనరల్  ఆఫ్  సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అడ్వైజరీ జారీ చేసింది. దీంతో మన దేశం నుంచి పడమర దేశాల వైపు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం వంటివి చేశారు. 

అలాగే, బూడిద మేఘాల గుండా వచ్చిన విమానాలను పూర్తిగా తనిఖీ చేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్​లైన్స్​కు చెందిన పలు సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని విమానయాన సర్వీసులు ప్రకటించాయి.

ఢిల్లీ ఏక్యూఐపై పెద్దగా ప్రభావం ఉండదు

బూడిద మేఘాలతో ఢిల్లీలోని ఎయిర్  క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) పై పెద్దగా ప్రభావం ఉండదని వెదర్ ఎక్స్ పర్ట్స్ తెలిపారు. మన దేశంలోకి ప్రవేశించిన ఆ మేఘాలు రాత్రి 7.30 గంటలకు చైనా వైపు వెళ్లాయని వాతావరణ సైంటిస్టులు వెల్లడించారు.

పర్వతం లోపల శిలాద్రవం వల్లే పేలుడు

12వేల ఏండ్ల తర్వాత హేలీ గుబ్బీ అగ్నిపర్వతం ఆదివారం నాడు బద్దలవడం అసాధారణమని సైంటిస్టులు చెబుతున్నారు. లోపల శిలాద్రవం (మాగ్మా) ఏర్పడేందుకు తగిన పరిస్థితులు ఉన్నంతకాలం ఆ పర్వతం ఎప్పుడైనా పేలిపోయే అవకాశం ఉందని నార్త్ కరోలినా వర్సిటీ వోల్కనాలజిస్ట్  అరియానా తెలిపారు.