కాస్ట్​లీ లిక్కరే​ కావాలె: ఓటర్ల డిమాండ్

కాస్ట్​లీ లిక్కరే​ కావాలె: ఓటర్ల డిమాండ్

చీప్​ లిక్కర్​ వద్దే వద్దంటూ క్యాండిడేట్లకు చెప్తున్న ఓటర్లు

ఎన్నికలకు, ఎన్నికలకు మధ్య ఓటర్ల టేస్ట్​ మారుతోంది. మొన్నటి దాకా చీప్​ లిక్కర్​ అయినా సరే అని పుచ్చుకున్న కొందరు ఓటర్లు ఇప్పుడు ఫారిన్​ బ్రాండ్స్, కాస్ట్​లీ లిక్కర్​ అయితేనే జై కొడుతున్నారు. మారిన ఓటర్ల టేస్టును చూసి అభ్యర్థులు బిత్తరపోతున్నారు. ఎట్లయినా గెలవాలని కొందరు క్యాండిడేట్లు.. ఫారిన్​ బ్రాండ్లు, కాస్ట్​లీ లిక్కర్​ తెప్పిస్తున్నారు. వైన్​షాపులు కూడా ఆ బ్రాండ్లను రెడీగా ఉంచుతున్నాయి. హైదరాబాద్​ శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

హైరేంజ్​ అయితేనే

మొన్నటి లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలప్పుడు చీప్​ లిక్కర్​కు బాగా గిరాకీ ఉండేది. కొందరు అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా ఓసీ, బీపీ లిక్కర్​ను  సప్లయ్​ చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ చీప్​ లిక్కర్​ను పంపిణీ చేయాలని భావించిన అభ్యర్థులకు ఓటర్ల నుంచి తిరస్కారాలు ఎదురవుతున్నాయి. బ్లెండర్స్ ప్రైడ్, టీచర్స్, వ్యాట్ 69, జానీ వాకర్, బ్లాక్ డాగ్ వంటి హైరేంజ్ లిక్కర్ అయితేనే తీసుకుంటామని ఓటర్లు తేల్చి చెప్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగి మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి స్థానిక యువకులకు, పెద్దమనుషులకు దావత్  ఏర్పాటు చేశారు. తీరా దావత్​ మొదలయ్యే టైంకు అక్కడి మద్యం బాటిళ్ల బ్రాండ్ లేబుళ్లను చూసిన యువకులు, పెద్దమనుషులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇదేంటని అడిగితే.. ‘ఐదేండ్లకోసారి వచ్చే ఎన్నికల్లో గీ బ్రాండ్ పోస్తారా’ అంటూ ప్రశ్నించారు. దీంతో చేసేదేమిలేక అక్కడి నాయకులు.. ఇతర ఏర్పాట్లు చేసి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఓటర్లకు తగినట్లుగా నాయకులు కూడా ఫారిన్ లిక్కర్, కాస్ట్​లీ లిక్కర్​ తెప్పించే పనిలో ఉన్నారు. మీడియం బ్రాండ్లను ముందుగా సప్లయ్ చేసినా.. కాలనీలు, అపార్టుమెంట్లలో నివాసం ఉండే ఓటర్లకు తగినట్టుగా ఫారిన్ లిక్కర్ తెప్పించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన వెనుక ఉన్న ఓటర్ల సంఖ్యను చూసైనా ఫారిన్ లిక్కర్ సరఫరా చేయాల్సిందేనని గల్లీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.

కాస్ట్లీ బ్రాండ్లకు డిమాండ్

చీప్ లిక్కర్ కంటే కాస్ట్​లీ బ్రాండ్లకు డిమాండ్​ ఉంది. పది రోజులుగా కాస్ట్​లీ బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంటే ఇంకా డిమాండ్​ ఉంటుంది. ఇప్పటికే పలు పార్టీల నేతలు కాస్ట్​లీ బ్రాండ్లను తీసుకెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. అంతే స్థాయిలో చీప్ లిక్కర్ స్టాక్ కూడా మెయింటెన్ చేస్తున్నాం.

– వైన్​షాప్ నిర్వాహకుడు, రాజేంద్ర నగర్

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి