ప్రమోషన్లు రావు.. పే స్కేలు ఇవ్వరు

ప్రమోషన్లు రావు.. పే స్కేలు ఇవ్వరు
  • పే స్కేల్ కోసం 23 వేల మంది వీఆర్ఏల ఎదురుచూపులు
  • ఆందోళనలో 23 వేల మంది వీఆర్‌‌‌‌ఏలు
  • ఏడు నెలలైనా నెరవేరని సీఎం హామీ

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ఏ)కు ప్రమోషన్లు నిలిచిపోయాయి. విద్యార్హతలతోపాటు సీనియారిటీ ఉన్నా.. ఇటీవల కల్పించిన ప్రమోషన్లలో వారికి అవకాశం కల్పించలేదు. మరోవైపు వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని ఏడు నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. ఒకవైపు ప్రమోషన్లు రాక.. మరోవైపు పే స్కేల్ అమలుకాక రాష్ట్రంలోని 23 వేల మంది వీఆర్ఏలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రమోషన్‌‌ చానల్‌‌కు బ్రేక్‌‌
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌‌గా (అటెండర్ కేడర్) పనిచేస్తున్నా వారిలో డిగ్రీ, పీజీ చేసిన వాళ్లు సుమారు 5 వేల మంది వరకు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012, 2014 సంవత్సరాల్లో రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన వారు 3,700 మంది వరకు ఉన్నారు. ఏడెనిమిదేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఒకటి, రెండేండ్లలో వీఆర్వోగా ప్రమోషన్ వస్తుందని భావించారు. ఒకే బ్యాచ్‌‌కు చెందిన వీరిలో ఉమ్మడి రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో పనిచేసే వీఆర్ఏలు మాత్రం  వీఆర్వోలుగా పదోన్నతి పొందారు. మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లో పనిచేసే వారికి మాత్రం ప్రమోషన్లు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే 2020, సెప్టెంబరులో వీఆర్వో వ్యవస్థ రద్దుతో వీరి ప్రమోషన్ చానల్‌‌కు గండి పడింది. సీనియారిటీతోపాటు అర్హతలన్నీ ఉన్నా వీఆర్ఏలుగా పనిచేస్తున వారికి ప్రమోషన్ ఇస్తే ఏ పోస్టు ఇవ్వాలనే విషయంలో రెవెన్యూ అధికారులు అయోమయంలో ఉన్నారు. జాబ్ నేచర్ ప్రకారం వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌‌‌‌లోకి వస్తారు. కాబట్టి వారికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే రాష్ట్రంలో ఉన్న 5 వేల మంది  వీఆర్వోల భవిష్యత్తు ఏమిటో ఇప్పటి వరకు తేలకపోవడం వల్ల వీఆర్ఏల ప్రమోషన్ల విషయంపై కూడా ఇప్పట్లో స్పష్టత రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పే స్కేల్ ప్రకటన హామీకి నాలుగేండ్లు
రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017, ఫిబ్రవరి 24న ప్రగతి భవన్‌‌లో వీఆర్ఏలతో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కానీ పే స్కేల్‌‌కు బదులుగా గౌరవ వేతనాన్ని రూ.6,000 నుంచి రూ.10,500కు పెంచారు. ఈ క్రమంలోనే 2020, సెప్టెంబర్‌‌లో వీఆర్వో వ్యవస్థ రద్దు సందర్భంలో వీఆర్ఏలకు మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని మరోసారి ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదు.

నేడు అత్యవసర సమావేశం
వీఆర్ఏల భవిష్యత్తుపై చర్చించి, ఆందోళనలకు కార్యచరణ రూపొందించేందుకు వీఆర్ఏల సంఘం నాయకులు మంగళవారం సీసీఎల్ఏలోని ట్రెసా ఆఫీసులో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులను కూడా ఆహ్వానించారు. అన్ని జిల్లాల నుంచి వీఆర్ఏ ప్రతినిధులు హాజరు కావాలని డైరెక్ట్ రిక్రూట్ వీఆర్‌‌ఏస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌‌ బహదూర్ కోరారు.