IND vs ZIM: 2026 టీ20 ప్రపంచకప్ విజయం సాధించిన తర్వాత వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత జట్టు, జింబాబ్వేపై జూలై 23న జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి ఎట్టకేలకు ఓటముల పరంపరకు ముగింపు పలికింది. ఐర్లాండ్ చేతిలో 2–0తో వైట్‌వాష్ కావడంతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 4–0 తేడాతో కోల్పోయిన టీమిండియా.. ఈ విజయంతో తిరిగి గెలుపు బాట పట్టింది.
ఐదో బౌలర్‌గా శివమ్ దూబే.. ఆరో బౌలర్ ఎక్కడ?:
ఈ విజయం ఊరటనిచ్చినప్పటికీ, జట్టు ఎంపికపై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా పలు ప్రశ్నలు గుప్పించారు. జట్టులో కేవలం నలుగురు ప్రధాన బౌలర్లను మాత్రమే తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియన్ టీమ్ ని పరిశీలిస్తే అందులో కేవలం నలుగురే ప్రధాన బౌలర్లు (ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్) ఉన్నారు.
ఐదో బౌలర్ ఎవరు? శివమ్ దూబే.. ఇక ఆరో బౌలర్ ఎవరు? ఎవరూ లేరు! ఆరో బౌలర్ లేకుండానే ఆడాలని భారత్ ముందే మానసికంగా సిద్ధపడింది అని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. శివం దూబే 4 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి ఒక వికెట్ (జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా) పడగొట్టాడు. అతడిచేత పూర్తిస్థాయిలో 4 ఓవర్లు బౌలింగ్ చేయించారంటే.. టీమ్ మేనేజ్‌మెంట్ దూబే బౌలింగ్ నైపుణ్యాలపై ఎంతగా నమ్మకం పెట్టుకుందో అర్థమవుతోందని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించారు.
ALSO READ : క్రికెట్‌పై కాక్‌రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్..
టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎందుకు:
జింబాబ్వే పర్యటనలో భారత జట్టు డగౌట్‌లో ప్రధాన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. సుదీర్ఘమైన మ్యాచ్ లు ఉండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు ఆయన సపోర్టింగ్ స్టాఫ్‌కు బీసీసీఐ ఈ పర్యటన నుంచి రెస్ట్ ఇచ్చింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌ను ఈ పర్యటనకు కోచ్‌గా పంపింది. రాబోయే 2026 ఆసియా క్రీడలలో (Asian Games 2026) కూడా లక్ష్మణే భారత జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. కాగా ఆగస్టు నెలలో శ్రీలంకతో జరగనున్న విదేశీ టెస్టు సిరీస్‌తో గౌతమ్ గంభీర్ మళ్లీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
