వనపర్తి టౌన్, వెలుగు: విద్యార్థులకు సరిపడా ఆర్టీసీ బస్సులు నడిపించాలని గురువారం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వనపర్తిలోని గాయత్రి పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు సరిపడా బస్సులు నడపకపోవడంతో ప్రతిరోజూ ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్లే సమయంలో బస్సు డోర్ వద్ద వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఓ విద్యార్థి బస్సు నుంచి కిందపడగా, గాయాలైనట్లు చెప్పారు.
ఈ విషయంపై డిపో మేనేజర్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందించలేదన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని, కాలేజీ వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. వివిధ సంఘాల నాయకులు మల్లేశ్, వీరన్న నాయక్, కుమార్, రాజవర్ధన్, శివ, బన్నీ, తిరుపతి, కార్తీక్, శివ నాయక్, రవి పాల్గొన్నారు.
