సర్కార్ సీడ్సే మొలకలొస్తలేవ్.. తల పట్టుకుంటున్న రైతన్న

సర్కార్ సీడ్సే మొలకలొస్తలేవ్.. తల పట్టుకుంటున్న రైతన్న

జిల్లాలో సోయా రైతుల ఆవేదన
వ్యాపారుల వద్ద కొన్నవి ఓకే

నిజామాబాద్, వెలుగు: సర్కార్ సప్లై చేసిన సోయా సీడ్స్ జిల్లాలో చాలాచోట్ల మొలకెత్తలేదు. సర్కార్ సబ్సిడీతో సొసైటీల ద్వారా సోయా సీడ్స్ సరఫరా చేయగా రైతులు పది రోజుల కింద వేశారు. ఇప్పటివరకు మొలకలు కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. సర్కార్ సరిపడ సీడ్స్ ఇవ్వకపోవడంతో కొందరు ప్రైవేట్ డీలర్లవద్ద కొనుగోలు చేసి వేయగా అవి మొలకలు వచ్చాయి. ఈ వానాకాలం సీజన్‍లో ప్రభుత్వం మొక్కజొన్న బదులు సోయాపంట వేసుకోవాలని సూచించింది. ఈమేరకు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లు పంటల సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 1.09 లక్షల ఎకరాల్లో సోయా వేయాలని నిర్ణయించింది. గత ఏడాది కంటే ఈసారి 42 వేల ఎకరాలను పెంచారు. పత్తిపంట కూడా వేసుకునే అవకాశం ఉన్నా చాలామంది సోయా పంట సులువుగా ఉంటుందని, మద్దతు ధర కూడా పెంచడంతో రైతులు మొగ్గుచూపారు. కానీ సర్కారు సప్లయ్ చేసిన సీడ్స్ వేసి మొలకెత్తకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

ఐదు ఏజెన్సీల ద్వారా సర్కార్ సీడ్స్ సరఫరా
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరపై సప్లయ్ చేస్తున్న సోయా సీడ్స్ టీఎస్ఎస్‍డీసీ, హెచ్‍ఏసీఏ(హాకా), ఎన్‍ఎన్‍సీ, మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్‍ ఏజెన్సీల ద్వారా జిల్లాలో సింగిల్ విండో, సొసైటీల ద్వారా సరఫరా చేస్తోంది. సర్కారు సప్లై చేసే సీడ్స్ కావడం, సబ్సిడీ పోనూ మార్కెట్ రేటు కన్నాతక్కువకు లభిస్తుండడంతో చాలామంది రైతులు కొనుగోలు చేశారు. కానీ అవి మొలకెత్తకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు.

మళ్లీ సీడ్స్ కొనుగోలు
సర్కారు సోయా సీడ్స్ మొలకెత్తకపోవడంతో నిరాశ చెందిన రైతులు భూమిని మరోసారి దున్నించి ప్రైవేట్ సీడ్స్ వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. ప్రైవేట్లో బాహుబలి, కరిష్మా, సంపత్‍, ఈగల్ రకాలను కొంటున్నారు. కాగా, సర్కారు సప్లయ్ చేసిన 30 కిలోల సోయా సీడ్స్ బస్తా ధర రూ.1,190 ఉంది. బయటి మార్కెట్లో బస్తాకు రూ. 2,550 నుంచి రూ.2,700 ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు.

జిల్లాలో ఎక్కడెక్కడంటే..
సర్కారు సప్లయ్ చేసిన సోయా సీడ్స్ బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‍పల్లి, వేల్పూర్, భీమ్‍గల్‍, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లోని పలు గ్రామాలతోపాటు ఆర్మూర్ మండలంలో మొలకెత్తలేదు. ఆయా మండలాల్లోని రైతులు దీనిపై ఇప్పటికే ఏఈఓల ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఎలాంటి సమాధానం లేదని వాపోతున్నారు.

పది రోజులైనా మొలువలే..
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిని సాయికుమార్ అనే రైతుకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. సర్కార్ సప్లై చేసిన సోయా సీడ్ సొసైటీలో కొని వేసిండు. వారం రోజుల్లోపే మొలకెత్తాల్సి ఉండగా, పది రోజులు గడుస్తున్నా మొలకలు రాలేదు. దీనిపై ఆఫీసర్లను అడిగితే ఏమైందో వాళ్లు సక్కగ చెప్తలేరు. దున్ని పిచ్చుడు, సోయా సీడ్స్, గడ్డి మందుకు వేల రూపాయలు లాసయ్యాడు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ గా డీలర్ల వద్ద కొనాల్సి ఉంటుంది.

For More News..

ఎమ్మెల్యేలవే ప్రాణాలా? సామాన్యులవి కావా?