నీళ్లు వేస్ట్​ చేస్తే జరిమానా

నీళ్లు వేస్ట్​ చేస్తే జరిమానా
  • రెండు, మూడు సార్లు చేస్తే కనెక్షన్​ కట్​

అసలే ఎండా కాలం. నీళ్లు దొరకడం గగనమైపోయింది. భూమిలో నీళ్లన్నీ ఎక్కడో లోపలికి వెళ్లిపోయాయి. నదులు, చెరువుల్లో నీళ్లు ఆరిపోతున్నాయి. తాగడానికీ నీళ్లు రావాలంటే ఓ రెండు రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అలాంటి నీళ్లను ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి.

ఒక్క బకెట్​ వేస్ట్​ చేసినా దాని ప్రభావం పెద్దగానే ఉంటుంది. అందుకే, నీటిని జాగ్రత్తగా వాడుకునేలా, ఎవరూ వేస్ట్​ చేయకుండా గుజరాత్​లోని దాహోద్​ నగరం ఓ మంచి కార్యక్రమాన్ని స్టార్ట్​ చేసింది. ఏంటంటారా.. అది ‘ఫైన్​’! అవును, నీళ్లను వృథాగా పారబోసే జనానికి జరిమానాలు వేస్తోంది. అన్ని చెరువులు, నదుల్లాగానే ఆ నగరానికి నీళ్లు అందించే ప్రధాన వనరులైన కదన డ్యాం, పాటా దుంగరి చెరువుల్లో నీటిమట్టాలు దారుణంగా పడిపోయాయి.

నీటి కొరత ఎక్కువైంది. రోజుతప్పించి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ కొరతను దృష్టిలో పెట్టుకునే ఈ ఫైన్​ను తీసుకొచ్చినట్టు నీటి సరఫరా కమిటీ హెడ్​ లఖాన్​ రాజ్​గోర్​ చెప్పారు. నీటిని వేస్ట్​ చేస్తున్నట్టు తెలిస్తే ₹250 నుంచి ₹500 వరకు జరిమానా విధిస్తున్నామన్నారు. అందుకోసం 9 వార్డు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.

అన్ని ప్రాంతాల్లోనూ డ్రైవ్స్​ నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. ఫైన్​ వేసినా రెండోసారి, మూడోసారి వేస్ట్​ చేస్తున్నట్టు తేలితే ఆ ఇంటికి నీటి కనెక్షన్​ను తొలగిస్తామని హెచ్చరించారు. దాహోద్​కు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు కొందరు నీటి సరఫరా పైపుల నుంచి నీటిని చోరీ చేస్తున్నట్టు  వడోదర జిల్లా కలెక్టర్​ చెప్పారన్నారు.