యూఎస్, ఇరాన్ సంక్షోభంతో దేశంలో పెరుగుతున్న ఎల్‌పీజీ గ్యాస్ కొరతపై కేంద్ర పెట్రోలియంశాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పందించారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. అదనపు ఎల్‌పీజీ సరఫరా కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.
యూఎస్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని మంత్రి అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రపంచ దేశాలతో ప్రధాని మోదీ చర్చలు జరిపి గ్యాస్, ఇంధన సరఫరాకు మినహాయింపులు కోరినట్లు వెల్లడించారు.
ఎల్‌పీజీ సంక్షోభం అనేక దేశాలను ప్రభావితం చేస్తోందని, మనదేశంలో కూడా ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావం పడుతోందని సురేష్ గోపి తెలిపారు. అయితే గ్యాస్ కొరతను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.
మరోవైపు దేశంలో అత్యవసర సేవలకు ఎల్‌పీజీ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఆసుపత్రులు, శ్మశానవాటికలు, ఇతర అత్యవసర సేవలకు ఎల్‌పీజీ సరఫరా నిరంతరం కొనసాగుతున్నట్లు మంత్రి వివరించారు.
త్వరలో మరింత ఎల్‌పీజీ సరఫరా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సురేష్ గోపి తెలిపారు.
