ఎమ్మెల్యే అభ్యర్థుల అప్లికేషన్లన్నీ పరిశీలిస్తున్నాం : మహేశ్ కుమార్ గౌడ్

ఎమ్మెల్యే అభ్యర్థుల అప్లికేషన్లన్నీ పరిశీలిస్తున్నాం : మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. టికెట్ కోసం పార్టీ లీడర్ల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తునూ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మంగళవారం పరిశీలించిందని చెప్పారు. కమిటీ సమావేశం తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 1,006 దరఖాస్తులు వచ్చాయని, ఇల్లందు నియోజకవర్గం నుంచి అత్యధికంగా 38 అప్లికేషన్లు వచ్చాయన్నారు. కొడంగల్, జగిత్యాల నియోజకవర్గం నుంచి ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చిందన్నారు. ప్రతి దరఖాస్తునూ పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ నివేదికలపై సెప్టెంబర్ 2న జరిగే సమావేశంలో మరోసారి చర్చిస్తామని వివరించారు. 

సెప్టెంబర్ 4న పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌‌ మురళీధరన్, సభ్యులు బాబా సిద్ధికి, జిగ్నేష్ మేవానీ హైదరాబాద్‌‌కు వస్తారని, 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారని తెలిపారు. ఈ మూడు రోజుల పాటు టికెట్ల కేటాయింపుపై నాయకులతో కమిటీ సంప్రదింపులు జరుపుతుందని వివరించారు. తొలి జాబితాలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చే స్థానాలను ప్రకటిస్తామన్నారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో టీపీసీ చీఫ్ రేవంత్‌‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజ నర్సింహ, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.