లోన్లు ఇస్తం.. మళ్ల ఎట్ల కడ్తరు

లోన్లు ఇస్తం.. మళ్ల ఎట్ల కడ్తరు
  • కార్పొరేషన్లకు సొంత ఆదాయం ఎట్ల వస్తది
  • టీఎస్ఆర్టీసీకి బ్యాంకుల ప్రశ్నలు
  • రోడ్ల అభివృద్ధికి రూ.800 కోట్లు తీసుకోవాలని నిర్ణయం
  • సర్కారు గ్యారంటీ సరిపోదంటున్న బ్యాంకులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ అడిగిన రూ.800 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని, కానీ తిరిగి ఎలా తీరుస్తారని బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వానికి లోన్లు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో జాతీయ బ్యాంకులు రుణాలిచ్చే ముందు సందేహాలకు స్పష్టత ఇవ్వాలని కార్పొరేషన్లను కోరుతున్నాయి. దీంతో బ్యాంకుల సందేహాలను తీర్చటానికి తర్జనభర్జన పడుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
ఇప్పటికే వేల కోట్ల లోన్లు
రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా నుంచి రాష్ర్ట రాజధానికి రోడ్ల విస్తరణ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు వేల కోట్ల నిధులవసరమని ఆఫీసర్లు తేల్చారు. అయితే ఏటా బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో నిధులు కేటాయిస్తున్నా విడుదల చేయకపోవటం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటం, వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రోడ్ల అభివృద్ధికి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిధుల కొరత, కొత్త అప్పులు పుట్టకపోవటంతో ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి పేరు మీద వేల కోట్ల లోన్లు తీసుకుంది. ఇందుకు ప్రభుత్వం షూరిటీ ఇచ్చింది. వీటిలో కాళేశ్వరం, మిషన్ భగీరథ, టీఎస్ఆర్టీసీ తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. అలా తెచ్చిన నిధులతో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇంటింటికీ నీటి సరఫరాతోపాటు పలు పనులు చేపట్టింది. అయితే ఈ లోన్లకు ప్రతి 3 నెలలకోసారి అసలు, వడ్డీ కట్టడం ప్రభుత్వానికి భారంగా మారింది. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కేటాయించిన నిధుల్లో సగానికి పైగా అసలు, వడ్డీలు కట్టడానికే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
పాతవి సక్కగ కడుతున్నం
కార్పొరేషన్ల పేరుతో లోన్లు తీసుకొని బ్యాంకులకు, ఇతర ఫైనాన్షియల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌‌‌‌‌కు సర్కారు షూరిటీ ఇస్తోంది. ఇటీవల లోన్లకు ఆర్బీఐ అనుమతి ఇవ్వకపోవటం వెనుక కారణమిదేనని తెలుస్తోంది. కేవలం ప్రభుత్వం షూరిటీ ఇస్తే సరిపోదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. లోన్లు తీసుకున్న కార్పొరేషన్ల సొంత ఆదాయ సేకరణ ఎలా అని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై తమకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.2,600 కోట్లను ఆర్డీసీ తీసుకుందని, వీటి అసలు, వడ్డీని 3 నెలలకోసారి సమయానికి కడుతున్నామని బ్యాంకులకు అధికారులు చెప్పేందుకు రెడీ అవుతున్నారు. లోన్ల రీపేమెంట్‌‌‌‌‌‌‌‌లో ఆర్డీసీ ట్రాక్ రికార్డ్ బాగుందని, దీంతో లోన్లు వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లోన్లు వచ్చాక ఏ రోడ్లు విస్తరించాలన్న దానిపై అధికారులు డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెడీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.